పుట:నారాయణీయము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



భూమిక

'నారాయణీయము' అను గ్రంథనామ మాంధ్రదేశమున కపరిచితము. ఆంధ్రమునకే కాదు. కేరళేతర దేశములకే యట్టి దనుకొనవచ్చును. ఉత్తమ జాతి యిక్కావ్యమును మహాపండితకవి యగు నారాయణభట్టపాదుఁ డను నంబూరి బ్రాహ్మణవంశజుఁడు మూఁడు శతాబ్దుల నాఁడు సంస్కృతమున రచింపఁగా - నీనాఁటికి మా మిత్రుఁడగు కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షిత కవివర్యుని తపః ఫలముగా నాంధ్రమున గోచరించినది. సహజ ధారాళ మృదు మధుర శయ్యలో ననువదింప నేర్చిన మా మిత్రుని కంటి కది. ముందుగఁ గనఁబడుట యాంధ్రుల భాగధేయము.

మా మిత్రుఁడు శ్రీశ్రీశ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతులగు శ్రీ మచ్చంద్రశేఖర సరస్వతీ భగవత్పాదువారి పరిపూర్ణానుగ్రహ భాజనుఁ డగుటచే మధుమయ వచోలాభమునొందిన ధన్యజీవి. 'సార కరుణాసార స్మిత జ్యోత్స్నికా చ్ఛవినంతర్గత గాఢ మోహతమమున్ జక్కాడి యాలోచనో, త్సవముం జేసిన ' మహనీయులు శ్రీ స్వాములవారు అని పలికిన దీక్షిత కవివరుని సూక్తియే నే నన్నదానికి సాక్షి. ప్రత్యక్ష దైవతములగునట్టి గురుమూర్తుల కరుణామృత రసప్లుతాశీర్వచన మొందు భాగ్య మెంతవారికి లభించును ? దీక్షిత కవి కావ్యమున కింతటి మధురిమము, 'ఇంత యఖండ వైభవము గలుగుటకు నా భగవత్పాదుల పాదారవింద మరందాస్వాదమే హేతువని నా యభిప్రాయము.

'మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగఁ బలుకు నదీ ధర్మయుతముగ సభలన్'

అని నన్నయభట్టారకుని సూక్తి. ఇన్ని ధర్మములు గల పలుకు దుర్లభమే ! లభించినను మహాసభలం దెవఁడు పలుకఁగలఁడు ? అట్లయిన ఋషియగు నా మహితుని వాక్కు. పొల్లగునా? అని చిరముగ నున్న సంశయము తొలఁగించు లక్ష్య మీనాఁటికి దొరకినదని సంతసించుచు నారాయణీయ మాంద్రీకృతము నరసి యీ భూమిక వ్రాయఁబూనితిని.