పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


సందడి గాకయుండ రిపుసైన్యపయోనిధిలంఘనక్రియా
మందతఁ జూపఁగావలయు మానుషభీషణభాషణోద్ధతిన్.

180


గీ.

ఎటకు నడువవలయు నిది మీరు తలపోసి, సర్వసమ్మతముగఁ జర్చ చేసి
నిర్ణయింపవలయు నీతిశాస్త్రవివేక, శౌర్యనిధులు సఫలకార్యవిదులు.

181


వ.

అని యిట్లు ప్రహ్లాదుండు పలికిన మహాహ్లాదంబునం బొంది బృందారకవిరోధు
లతని నభినందించి దేవా నరేశ్వరుం డగువాఁడు హస్త్యశ్వరథపదాతిప్ర
ముఖసకలసేనాసమన్వితంబుగా స్వామ్యమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలం
బులను సప్తాంగంబులుం గలిగి సంధివిగ్రహయానాసనద్వైధీభావసమాశ్ర
యంబు లనం బరఁగు షట్ప్రయోగంబులఁ గుశలుం డై సామదానభేద
దండంబు లను నుపాయంబులుం దత్ప్రయోగసమయంబు నెఱింగి చతుర్విధ
దుర్గావనభర్గుం డై నిజరాజ్యంబు నిష్కంటకంబుగం బాలించి మే లెంచు
నది యాకర్ణింపు మనుటయు నాత్రిలోకవినుతుండు వారలవాక్యంబు లంగీక
రించి సంగరోద్యోగవినిర్నిద్రహృదయుం డై వారలఁ బోవం బనిచి తాను
యథోచితప్రకారంబున నారాత్రి గడపె నప్పుడు.

182


మ.

రజనీపన్నగదష్టమూర్ఛితజగద్రక్షార్థ మై పూని పం
కజమిత్రుం డను తుండికుండు దశదిగ్భాగాంతరానోకహ
ద్విజకోలాహలమంత్రము ల్నుడువుచు న్వేగంబ మంత్రింప ని
ల్చె జలేశాంతరపూర్వభూభరమహాశృంగాగ్రపీఠంబునన్.

183


ప్రహ్లాదుఁ డంగరాజుపై దాడి వెడలుట

సీ.

అట్లు సూర్యోదయం బైనఁ బ్రహ్లాదుండు జయభేరి వేయించి చండవృత్తి
తురగేభరథపదాతులతోడ దైతేయభటసమూహము మహోత్కటము గాఁగ
విజయుఁ డై సర్వజగ్విజయంబు సేయంగఁ బూని మహేంద్రదిగ్భూమీపాల
పురములకై దాడివోవ నుద్యోగించి కదలి యాత్రేయనగంబునందు
విడిసి మఱునాఁడు శత్రుభూవిభులు వడఁక, నంగదేశాభిముఖుఁ డయ్యె నంతలోన
నంగభూపతి గజతురంగాదిసైన్య, సంయుతంబుగ నేతెంచె శౌర్యగరిమ.

184


క.

కరితురగరథభటాహ్వయ, పరివృతుఁ డై బాహుయుగము పక్షయుగముగా
శరచంచునిహతిఁ జించెన్, శరభముక్రియ నంగవిభుఁడు శత్రుబలంబున్.

185


క.

అంతం బోవక మఱియును, బంతంబున దైత్యబలముఁ బవనాస్త్రహతిన్
గంతులు వేయించె మహీ, కాంతుఁడు విలయానిలంబు కనకాద్రిబలెన్.

186