పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 2-3

నారసింహపురాణము. ఆ -2

141


వ.

ఏ నెఱింగించిన తెఱంగ మీయంతరంగంబులం దరంగితంబైనయది గదా
గదాధరచరణసేవనచతురుం డగు ప్రహ్లాదకుమారునకు నాహ్లాదంబు పుట్టు
నట్లు గొన్ని యుపాయంబులు పన్ని సర్వంబును శుభోదర్కంబు సేయుదము
వినుం డనిన వెండియు వార లిట్లనిరి.

76


చ.

కనలక దేవతావిభునికార్యవశస్థితియంద నిల్చుచు
[1]న్మనలను జేరనీఁడు లవమాత్రము నిర్జరశత్రుసూతి యే
యనువునఁ బుట్టెనో నిజకులాంబుధిశోషణబాడబాగ్ని యై
తనమదిలోనఁ బెద్దలప్రతాప మెఱుంగఁ డెఱుంగఁ డేమియున్.

77


క.

అతఁ డేకైవడి నస్మ, న్మతమున కొనగూడి దివిజమర్దనలీలో
ద్ధతి చూపు శ్రుతిసుఖంబుగ, హితసూక్తులఁ దెలుపవే యహీనవివేకా.

78


వ.

అనిన వారల కతం డి ట్లనియె.

79


క.

ఏ కార్యంబున నసుర, క్ష్మాకాంతుఁడు తెలిసి మనవశంబునఁ దిరమౌ
నాకార్యము వినిపించెద, నాకర్ణింపంగవలయు నందఱు మీరల్.

80


క.

ఏకాలంబున నెవ్వని, కేకార్యము జరపవలయు హితవెఱిఁగి నరుం
డా కాలంబున నతనికి, నాకార్యము సలుప ఫలము నందఁగవచ్చున్.

81


క.

ఆరూఢయౌవనుం డై, నారీజన సరసకేళి నర్మసఖుం డై
యారక్షోవీరుఁడు సం, చారము లొనరించుఁ గృతకశైలములందున్.

82


సీ.

మాధవవల్లరీమండపాంతరముల మధువేళ విహరించు మదమువొదల
గ్రీష్మాట్టహాససంకీర్ణపుష్పంధయధ్వానంబు వనుఁ దపవాసరముల
శైలకందరనటన్నీలకంఠోత్తాలవైఖరి పాటించు వర్షలందు
నుద్దండపుండరీకోత్పలచ్ఛన్నదీర్ఘికల శారదవేళఁ గ్రేళ్ళుమలఁగు
హిమశిశిరసముచిత మైన యిచ్చనిచ్చ, నంగనాలింగనాహ్లాద మాత్మఁగోరు
నిపుడు ప్రహ్లాదుఁ డతనికి నిందుముఖులఁ, గన్యకలఁ దెచ్చియిచ్చి రాగమునొనర్చి.

83


వ.

నేర్పు మెఱసి కందర్పవిహారలంపటుం డగునిలింపారిం జేరి పర్యాయగతిం
బాటవంబు మెఱసి బాంధవం బతిదృఢసంధానబంధురంబుగ నమరించి
యమరులయంటు వాసి మననంటున మెలంగునట్లు చేసిన సకలశోభనంబు
లుం గరతలస్ఫటికంబుల.......................కరణీయం బగు నతండు.

84


క.

కులమున రూపున గుణమున, బలమున సంబంధమునకుఁ [2]బాత్రుం డగు మీ
తలఁపునకు నెక్కెనేనియుఁ, దలఁచిన పనులెల్ల సఫలతాయుతము లగున్.

85
  1. మనముల
  2. బ్రాప్తుండగు