పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారసింహపురాణము. ఆ - 2

139


సురలును దానుఁ గూడి మనచొప్పునఁ బోవక శౌర్యహీనుఁడై
యరులకుఁ గ్రిందివాఁ డగుచు నాహవదోహళి గాఁ డొకింతయున్.

56


సీ.

సమరాభిముఖు లైనయమరవీరులఁ గిట్టి యనిమొనఁ దుత్తుము రాడవలదె
దర్పితదండయాత్రాభేరిభాంకారఝంకారముల మిన్ను చఱవవలదె
యుత్పలదళములయొప్పునఁ జైకొను నరిశిలీముఖముల నాఁపవలదె
తుంగమాతంగశతాంగతురంగాంగశకలకోటుల నేలఁ జమరవలదె
కలవె యొకనిఁ గొలిచి గర్వవిహీనుఁడై, యూడిగములు సేయుచున్నపతికి
ధూర్తవిజయలబ్ధి కీర్తిప్ర తాపంబు, లసురసుతున కిట్టు లడఁగఁదగునె.

57


క.

మన మితనికిఁ బగవారము, మనపగరులు ప్రీతిపరులు మనవాక్యంబుల్
విననొల్లఁడు ప్రహ్లాదుఁడు, మనకార్యం బెట్లు నిలుచు మాన్యచరిత్రా.

58


గీ.

ఆహిరణ్యకశిపునందు నీమామిడి, కిందిసోమ రెట్లు బొంది యెత్తెఁ
బులికి మేఁకమఱక పుట్టినయ ట్లయ్యె, శిరసు లెత్తి తిరుగ సిగ్గుగాదె.

59


క.

అనిమిషు లితనికి సఖులై, మనుచుండిర యేని దివిజమర్దనకులముం
దునుముదురు పూర్వవైరము, మనముల నిడి పాముతోడిమచ్చిక దగునే.

60


క.

అందఱముఁ గూడి యీకసు, గందుం దునుమాడి యొక్కకఠినభుజబలో
గ్రుం దెచ్చి రాజుఁ జేసినఁ, బొందు నమందాఘనిచయములు ఘోరములై.

61


గీ.

రాజపుత్త్రుఁ దునుమరాదు వేల్పులచేతఁ, బడఁగరాదు దురితపదవి చొరని
కార్య మెద్దిగలదు ధైర్యంబుతో నది, నీవు నిర్ణయించి నిర్వహింపు.

62


మ.

ఘనసంగ్రామపరుల్ హిరణ్యకశిపుక్ష్మావల్లభుం గొల్చి త
ర్జనముల్మీఱ సురేంద్రముఖ్యవిబుధవ్రాతంబు భీతిల్లఁ ద
ద్వనితాజాతముఁ బట్టి తెచ్చు మన మాదైత్యారులం జేరి సి
గ్గున వర్తించుటకన్న మే ల్గిరిగుహాక్షోణీతతిన్ దాఁగుటల్.

63


ఉ.

పక్షికులేంద్రవాహనుని బల్విడిఁ దోలఁగరాదొ దేవతా
ధ్యక్షునివైభవంబులు ప్రతాపమునన్ హరియింపరాదొ త
త్పక్షమువారి నెల్ల శితబాణపరంపరఁ గూల్పరాదొ యీ
యక్షము రాక్షసేంద్రసుతు నాడెడి దేమి వివేకహీనునిన్.

64


చ.

మనము దొలంగినప్పుడె క్రమంబున దేవత లెల్ల దైత్యరా
ట్తనయుఁడు వీఁ డటంచు నతిదారుణవృత్తిఁ గడంగి దూషణం
బున కభివక్త్రులై నిమిషమున్ ధర యేలఁగనిత్తురేల యీ
ఘనునకుఁ జెల్లునా యసురకంటకు సఖ్యము సౌఖ్యహేతు వై.

65