పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 11


యాదిభాగవతుఁ బ్రహ్లాదునిఁ దద్రాజ్యవిభునిఁగా నొనరించి శుభము లొదవఁ
బ్రజల రక్షించి భూభారమంతయు మాన్చి నిశ్చింతహృదయుఁడై నెగడియుండె
నంత హతశేషులైన దైత్యాధిపతులు,సంతతంబును భయసమాక్రాంతు లగుచు
మందరద్రోణికామధ్యమంబునకును, జేరి యచ్చో మిథస్సమాసీను లగుచు.

92


క.

చింతాపరవశులై మది, నెంతయుఁ బరితాప మంది హితకార్యంబుల్
చింతించుచుఁ దమలో న, త్యంతంబును బ్రదుకుఁదెరువు తహతహ సూపన్.

93


ఉ.

దానవనాయకుం డణఁగెఁ దత్సుతుఁ డిప్పుడు విష్ణుభక్తుఁడై
దీనునిమాడ్కి బ్రత్యహము దేవగణంబుల కాప్తుడై తదీ
యానుమతంబు లైనపను లర్థి నొనర్చుచు నున్నవాఁడు దు
ర్మానముతోడఁ దండ్రిపగ మానసవీథిఁ దలంపఁ డింతయున్.

94


సీ.

అవినీతుఁ డైనప్రహ్లాదుని మనకెల్లఁ బతిగాఁ దలంచినఁ బ్రాణహాని
వంద్యుఁడై దేవుఁడై వరదుఁడై దైతేయపతుల కెల్లను దిక్కు పార్వతీశుఁ
డామహాత్ముని నాత్మఁ బ్రేమతోఁ దలఁచినఁ గలుగు నిష్టము[1]లైన ఫలము లెల్ల
నీయఁడే తొల్లి దైత్యేంద్రుల కతిమోదమున వరంబులు లోకములు నుతింప
ననుచుఁ దలపోసి యాతుధానాగ్రచరులు, పద్మమిత్రునిపై దృష్టి పాదుకొలిపి
జలము వాయువు నాహారములుగ నడపి, తపము సేయంగఁ బూనిరి దర్ప ముడిగి.

95


దానవులు శివునింగూర్చి తపము చేయుట

చ.

దనుజులు దేహవాంఛ విడఁదన్ని శివాధిపుఁగూర్చి సంతసం
బునఁ దప మాచరించునెడఁ బుట్టినతద్దహనోగ్రకీలల
న్మునుకొని సర్వలోకములు ముచ్చముణింగె బెహారి సంచుల
న్దినముతుది న్ముణించినగతిం బ్రవిముక్తబహిఃప్రచారతన్.

96


క.

దనుజకృతం బగుతపమున, మనసిజసంహరునినిండుమనము గరంగెం
గనదనలద్రావితనూ, తననవనీతప్రపూరితకలశలీలన్.

97


సీ.

వలమానదహనకీలల నీను నెమ్మోము ములికితో డావంక కలికితోడ
వెలఁది వెన్నెలరేల వికసించు విరవాజి[2]పువ్వుతో నిద్దంపునవ్వుతోడ
వలపు వసంతంబుఁ దలకొల్పు సుస్నిగ్ధభూతితో శృంగవద్వీతితోడ
వికటంపులీలలు ప్రకటించి నవ్వించు వందితో[3] విసురూపుమందితోడ
భుజగహారంబుతోడఁ గర్పూరతుహిన, రాశిసంకాశకాంతిపూరంబుతోడ
నమరరిపులకుఁ బ్రత్యక్ష మయ్యె నిఖిల, సంయమీవశంకరుం డగుశంకరుండు.

98
  1. నిష్కము - మూ.
  2. విరివాజి - మూ.
  3. నందితో-మూ.