పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక -4-5

నారసింహపురాణము. ఆ-1.

175


ధ్యను హనుమాంగనామణి ముదంబలరంగ వివాహమై సుహృ
జ్జనములు సన్నుతింప ఘనసంపద సొంపువహించె నెంతయున్.

45


క.

అంగజనిభుండు కొండన, యుం గడువైభవము మీఱి నుత్పలగంధిన్
రంగాంబను నిరుపమితశు, భాంగి న్వరియించి మించె నంచితలీలన్.

46


గీ.

ఆసరసమంత్రిశేఖరు నవరజుండు, గంధిలాశుగలావణ్యగణ్యమూర్తి
తిమ్మధీమణి వెలసె ధాత్రీతలమునఁ, బన్నగారాతివాహనభక్తిపరత.

47


మ.

భువిలో నన్నమువెట్టు ద్వాదశుల నాభూదేవరత్నంబు రెం
డవరుక్మాంగదభూకళత్రుఁడొ యనా నర్థుల్ ప్రియంబందఁ గ
ర్ణవితీర్ణి[1]ప్రతిభావిభాసి యయి యెన్నం[2]జాలి మందాకినీ
లవలీకల్పలతాసితాంశుహిమఖేలత్కీర్తిసంపన్నతన్.

48


గీ.

ఆతనికిఁ బుణ్యవతియైన యక్కమాంబ, వలనఁ దనయులు గలిగిరి వనధిసములు
తిమ్మధీరుండు నప్పమంత్రియును నరస, సచివుఁడును దిర్మలయ్యయుఁ జారుయశులు.

49


క.

ఏవంవిధవంశంబున, నావిర్భూతప్రధానహర్యక్షులలో
శ్రీ వెలయఁ గీర్తిశుభగం, భావుకుఁడై రంగమంత్రి మహి నుతికెక్కెన్.

50


సీ.

సర్వంసహామహాజలరుహాకరమున విహరించు నేమంత్రి విజయలక్ష్మి
దిగ్వధూదరహాసదీప్తులతోఁ జెల్ని గావించు నేమంత్రి ఘనయశంబు
పెరిమె నంభోధికిఁ బెక్కండ్రుసతుల నుత్పాదించు నేమంత్రి దానవారి
పున్నమజాబిల్లి చెన్ను నన్నువచేసి నవ్వు నేమంత్రి సౌందర్యరేఖ
యతఁడు హావళి చినయౌభళావనీశ, బహుళసామ్రాజ్యధౌరేయమహిమనిపుణ
విపులబాహార్గళాటోపవిజితభుజగ, సార్వభౌముండు రంగయసచివఘనుఁడు.

51


సీ.

వైభవస్ఫురణచే వజ్రాయుధుండయ్యు నన్యభామినిఁ గోరఁ డాత్మయందు
సౌందర్యరేఖతోఁ జక్రాహితుండయ్యుఁ దొడిఁబడ నిజగురుద్రోహి గాఁడు
వరదానవైఖరి వైరోచనుండయ్యుఁ గించిత్తు నర్థికిఁ గ్రిందుపడఁడు
వల్గువిక్రమశక్తి ఫల్గునుండయ్యును వెఱచి పోర శిఖండి వెనుక నిలువఁ
డవుర కర్ణాటలాటచోటాంధ్రముఖ్య, మానవాధిపఘనసభామధ్యభాగ
మాగధానీకజేగీయమానకీర్తి, రమ్యగుణహారి నరసయరంగశౌరి.

52


శా.

కట్టించెం గలశాంబురాశితనయాకాంతామితాగారము
ల్పెట్టించెన్ ధరలోన సత్రములు భూబృందారకశ్రేణికి

  1. వితీణ్నన్ - మూ.
  2. యుంన్నన్ - మూ.