పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 4-5

నారసింహపురాణము. ఆ -1.

171


సీ.

హితులు సామంతులు సుతులు దాయాదులు నృపులు బాంధవులు మనీషివరులు
పౌరాణికులు రాయబారులు సుకవులు వందిమాగధులు దైవజ్ఞమణులు
దొరలు పురోహితు ల్దుర్గాధినాథులు మంత్రులు గణికులు మాన్యజనులు
భటులు వారస్త్రీలు నటులు నాటకు లాదియగునియోగములెల్లఁ దగినయెడల
వరుసతోఁ గొల్వ వైభవస్ఫురణ మెఱసి, యెలమిఁ గైసేసి రెండవయింద్రుమాడ్కిఁ
గొలువుసకలంబుఁ జెంగల్వకొలనిఁ బోలఁ, గొలువు గూర్చుండి హరికథాగోష్ఠి దవిలి.

13


క.

ననుఁ బిలువఁబనిచి యర్ధా, సనమున నుపవిష్టుఁ జేసి సన్మానములం
దనియింది చిఱునగవు మొగ, మున నీరికెలొదవ వినయమున ని ట్లనియెన్.

14


సీ.

విను రాఘవమనీషి హనుమత్కృపానరలబ్ధకవిత్వవిలాసమహిమ
దనరి యేకాదశద్వాదశస్కంధము ల్దెనిఁగించె మీతండ్రి ధీయుతుండు
హరిభట్టు నిఖిలవిద్యాచతురాస్యుండు రాజమాన్యుఁడు కవిరాజనుతుఁడు
నారసింహపురాణపౌరస్త్యభాగంబుఁ జెదలువా డెఱ్ఱన మొదలుసేయఁ
బ్రతిభ దళుకొత్త నుత్తరభాగ మిప్పు, డంధ్రభాషను వచనకావ్యం బొనర్చె
నాప్రబంధంబు నాపేర నంకితముగ, నీవు గావింపవలయుఁ గవీంద్రగణ్య.

15


క.

కృతము మనినసత్పురుషులు, కృతులవలనఁ గాదె భువినిఁ గీర్తి గని మహా
కృతకృత్యు లైరి గావునఁ, గృతి దక్కఁగ నొండు కీర్తి హేతువు గలదే.

16


వ.

అని సకర్పూరవీటికాశాటికాలంకారపేటిక లిచ్చినం బరిగ్రహించి.

17


క.

మిసిమిగలపసిఁడి[1]పుయిదకు, వసుదేవజముద్ర దొరకువడువున నస్మ
ద్రసవత్కవితాయువతికి, రసికుం డగుప్రోలుగంటి రంగన గలిగెన్.

18


వ.

అని పరమహర్షోత్కర్షంబున నంగీకరించి యేతత్ప్రారంభంబునకు శోభనాచా
రంబుగాఁ దదీయవంశావతారం బభివర్ణించెద.

19


సీ.

గాధినందనతపోగాధపయోధి పార్ష్ణిద్వయద్వయస మేనియతమతికి
నింద్రసన్నిభహరిశ్చంద్రాదిభూపతుల్ శిష్యు లై మెలఁగి రేశీలఖనికి
యోగీశవాఙ్మనసాగమ్యతత్త్వంబు కరతలామలక మేపరమమునికి
సకలవిద్యావిశేషజ్ఞానసారంబు హృదయస్థ మేవిజితేంద్రియునకు
నతఁడు ఫణివరకుంభజన్మాబ్జమిత్ర, నివసనోచితదండకుండీజపాక్ష
వలయుఁ డమరాదినుతతపోబలముకలిమి, జయముపూని[2] యరుంధతీజాని వెలయు.

20
  1. పసిఁడి పూదెకు అని యుండవలయునేమో, పూదెయనఁగా బంగారుపూస.
  2. పూని అరుంధతీజాని - మూలము