పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

నారసింహపురాణము

ఉత్తరభాగము

ప్రథమాశ్వాసము

కృత్యాదిస్తోత్రాదికము

శా.

శ్రీమహిళాంతరంగసరసీజనభోమణి యాదవాన్వయ
గ్రామణి సర్వదైవతశిఖామణి యాశ్రితభక్తలోకవాం
ఛామణి శాంబరీమృగదృశామణి వేంకటశైలరాజర
క్షామణి ప్రోలుగంటి నరసప్రభురంగనం బ్రోచుఁ గావుతన్.

1


చ.

మరుని జయించియు న్మరల మచ్చిక వచ్చి ప్రసన్నమూర్తి యై
గిరిజకు మేను జాహ్నవికిఁ గెంజడలుం దగ నిచ్చి నిచ్చలు
న్సురతసుఖప్రసంగతులఁ జొక్కెడుశంభుఁ డొసంగుఁగాత భా
స్కరసమతేజుఁ డైననరసప్రభురంగన కీప్సితార్థముల్.

2


సీ.

చిలుకతోఁ దేనియ ల్చిలుకంగఁ బలుకుచు ముద్దాడు నేవేల్పుముద్దరాలు
తనతనూరుచిధారఁ దనరుచందురుడాలు వారించు నేవేల్పువారువంబు
మధురసం బానించి మధులిహంబుల కింపుపుట్టించు నేవేల్పుపుట్టినిల్లు
కల నన్నమాత్రానఁ గలకల నగుచు నానందించు నేవేల్పునందనుండు
కల్పితాఖిలలోకైకవేల్పు వేల్పుఁ, బెద్ద నలువ కృపాసముపేతదృష్టి
గలితయగుఁ బ్రోలుగంటి రంగప్రధాన, శేఖరున కాయురభివృద్ధి సేయుఁగాత.

3


చ.

నరసురవంద్యుఁ డౌకమలనాభునురఃస్థలి నున్న మాడ్కిఁ గి
న్నరసముదాయభర్తసదనంబున నిల్చినవైఖరిం బ్రసూ
నరసమిళచ్ఛరాసను ననన్యజుఁ గన్నపయోధికన్య యీ
నరసయరంగమంత్రిభవనంబున వేడ్క వసించుఁగావుతన్.

4


ఉ.

అంబ నిజాంఘ్రిపద్మవినతాఖిలదేవకదంబ చారువ
క్త్రాంబుజవైరిబింబ లలితాలకనిర్జితనీలనీలరో
లంబ సమగ్రమంగళవిలాసకళానికురుంబ ప్రోచు నే
య్యంబునఁ బ్రోలుగంటి నరసాధిపురంగయమంత్రిపుంగవున్.

5