పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

వేదపురాణశాస్త్రపదవిం దుదివిన్కి యెఱింగి ధర్మసం
పాదితయాగతంత్రుఁ డయి బాంధవపోషణకామధేను వై
నా దెసఁ గల్గు భక్తికతన న్విలసిల్లె నతండు తొల్లి ప్ర
హ్లాద పటుప్రసాదనిఖిలస్తుతభూరిదయామయాశయా.

125


వ.

ఆవిష్ణుశర్మ తనధర్మపత్నియందు మందేహుం డునందనుం గాంచి యావి
ర్బూతబుధగ్రహుండగు సుధాకిరణుకరణిం బరిణమించె నావిప్రకుమారుండు.

126


క.

కాలోపనీతుఁడై గురు, జాలంబులయొద్ద జదివె సకలాగమముల్
నాళీకగర్భుసన్నిధిఁ, దాలిమి మును భృగువుచదువు తాత్పర్యమునన్.

127


శా.

వాచాచాతురి వక్కాణించు సభలన్ నేపధ్యహృద్యంబుగాఁ
దూచాతప్పఁడు వేదవాదములయందు న్నవ్యకావ్యోదయ
శ్రీచాతుర్యము సంఘటించు దృహిణస్త్రీమూర్తి విస్ఫూర్తి యై
భూచక్రస్తుతుఁ డైనవిప్రతనయుం బోలంగలే రెవ్వరున్.

128


వ.

ఆమందేహుండు సదసత్సందేహగోచరావలగ్న యై సులగ్న యనుపేరి పురం
ధ్రిం బెండ్లియై నిజజ్యేష్ఠభ్రాతలగు విధాతృధాతృ సంయాతి యయా త్యను
యాతి భూతి ప్రభూతిచ్యవనులకు నవిధేయుం డై వివిధవిభవానుభవంబుల
నభినవయౌవనసౌభాగ్యంబు సఫలంబుగఁ జేయుచు నుండె.

129


సీ.

అనుదినాభ్యంగంబు నభినవధౌతవస్త్రాదరణంబు ననర్ఘ్యరత్న
భూషణాకలనంబు భూరిసౌరభగంధసారకస్తూరికాచర్చ వికచ
విచికిలదామసంవేల్లనంబును బరమాన్నభోజనమును నాటపాట
లాసన్నతీర్థయాత్రానుకూల్యంబును దుర్ద్యూతకేళియు ధూర్తరతియుఁ
గలిగి దుర్వారసంసారగౌరవంబు, దలఁపఁ డొకనాఁడు వేదశాస్త్రములు విడిచి
వీటఁ గ్రుమ్మరు విటవేషవిలసనమున, దేహవన్మన్మథుండు మందేహుఁ డకట.

130


క.

పొదువుకొని వత్తు రన్నలు, తుదిపుట్టువుగాన వాని దుశ్చేష్టలు నె
మ్మదిఁ దలపోయక యట్లనె, వదినెలు వాటింతు రాకువాళపుమఱఁదిన్.

131


క.

చిల్లరచేఁతల నిల్లుం, బొల్లుం జెల్లుగ వెఱంజి భూసురసూనుం
డుల్లోకవృత్తిరోవెల, పల్లవపాణులకు నొసఁగుఁ బ్రల్లద మొదవన్.

132


సీ.

పలుదెఱంగుల బుద్ధి దెలిపి రన్నలు సారె రీతి గా దనిరి తండ్రియును దల్లి
ముట్టనాడిరి కూర్చుచుట్టంబు లెల్లరు సరిగృహమేధు లసహ్యపడిరి
గురువులు చెక్కిలిగొట్టి వారించిరి సజ్జను లిది దురాచార మనిరి
పలుచగాఁ జూచిరి ప్రభువురాణువవార లోవనివారు బిట్టుబ్బినగిరి