పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 5-6

నారసింహపురాణము ఆ.5

325


వ.

ఆప్రహ్లాదుం డప్రతర్కితవీరరసప్రసారుం డై మసారసారవర్ణంబును మహిత
జనయోగిహృదయాభ్యర్థంబును మంజులప్రభానుభావవికీర్ణంబు నగుతత్త్వం
బు సాత్త్వికబుద్ధిం దలంచుచుం గలంచునలఘుతమఃపుంజంబు గుఱించి విరించి
బాణప్రయోగంబు సేయుటయు.

68


క.

తమ మెల్ల నణఁగె వాయు, క్రమవిక్రమణంబు సడలెఁ గానఁగవచ్చెం
గమలాప్తబింబ ముజ్జ్వల, తమమై దివిఁ దోఁచెఁ జంద్రతారాచయఘుల్.

69


క.

ఆపన్నగవజ్రాయుధు, నాపన్నగశాయిఁ దలంచునంత నసురహృ
త్తాపంబు లణఁగెఁ జాలఁ బ్ర, దీపించెఁ బ్రబోధరవి యుదీర్ణప్రభుఁ డై.

70


గీ.

పొదివియున్నబలము లదవద యైపోవ, నుప్పుగల్లువోలె నొకఁడ నిలిచి
శాంతుఁ డగుచు నసుర చింతించుఁ దనలోన, దేవమతము వాసుదేవమహిమ.

71


సీ.

ఇంతయై యంతయై యేమియు నెఱుఁగని నావర్తనంబు లున్నతికిఁ దెచ్చెఁ
బ్రాణగొడ్డము లైన బలుసంకటంబులు పాయంగఁ ద్రోచి శోభనము నొసఁగెఁ
బరమతత్త్వ మెఱుంగు బ్రహ్మర్షికులములో నన్నగ్రగణ్యుగా నెన్ని మనిచె
నిబిడతామసగుణాన్విత మైనకులమునఁ బుట్టినాఁ డనక చేపట్టె నన్ను
నట్టి హరికిని భృత్యులౌ నమరవరుల, దుష్టజనబోధములు విని తూలఁజేసి
వాసివహియించియున్న నావరభుజోరు, శక్తి యి ట్లయ్యె ఖలులకు జయము గలదె.

72


సీ.

హరిదాసు లగువార లఖిలధర్మజ్ఞులు హరిదాసు లుజ్ఝితదురితభరులు
హరిదాసు లాగమోత్కంశుకపంజరుల్ హరిదాసు లురుకీర్తిహారయుతులు
హరిదాసు లనఘలు హరిదాసు లప్రమేయారంభతత్త్వనిత్యస్థలములు
హరిదాసు లెవ్వనియాలయంబులకైనఁ జనిరి వైకుంఠ మాస్థలము లెల్ల
నట్టిహరికిని దాసులై యతిశయిల్లు, వృత్రశాత్రవముఖులైన విబుధులకును
నెగ్గు సేసితిఁ గావున నిపుడు నాకు, నిట్టి దుర్దశ వాటిల్లె నేది గతియొ.

73


క.

దుర్బోధకరులు సఖులున్, మార్బలముల గెలువఁజాలు మత్పరికరమున్
నిర్బంధము నొందిరి భువ, నార్బుదసంక్షోభకృన్మహానిలవిహృతిన్.

74


క.

ఘోరవనంబులు నక్ర, క్రూరమహానదులు విపులకూటనగేంద్ర
క్ష్మారుహములు దక్కఁగ నె, వ్వారుం బొడసూప రెట్టివడువో యిచటన్.

75


క.

ఏ నెంతదవ్వు వచ్చితి, నో నాకము వెడలి మన్మనోగతఁ దత్సం
ధానము తోఁపదు వికలత, మానసమునఁ బర్వె నెట్టిమత మీమతమో.

76


ఉ.

నేరుపునేరము ల్కలపనేరఁడు సారసపత్రలోచనుం
డారజనీచరారిచరణాంబుజము ల్మది నిల్పియున్న నె