పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 5-6

నారసింహపురాణము. ఆ - 4

315


క.

పూజించి తెచ్చి నిజమృగ, రాజమణిపీఠి నునిచి ప్రాంజలి యగుచున్
వేజాడల నుతియించెఁ బ, యోజాసనుఁ బొగడు నిగమమో యితఁ డనఁగన్.

157


ఉ.

ఆదర మొప్ప శుక్రుఁ డమరాహితనందను నిందుకాంతసం
పాదితపీఠిపై నునిచి పల్కు హిరణ్యనిశాటపుత్ర యా
హ్లాద మొనర్చె నీచరిత మంతయు మాకు నశేషశోకవి
చ్ఛేదిని యయ్యె నీభుజవిశేషవిజృంభితశక్తి యుక్తియున్.

158


మ.

జనకుం జంపిన క్రించు వీఁ డని రమాజాని న్విసర్జించి నీ
యనిఁగుందమ్ములు నెల్లబాంధవులు గాఢానందపాథోధిమ
జ్జనముం జేయ మహేంద్రు గెల్చి త్రిదివేశత్వంబునుం బొంది వం
దనము ల్గొంటివి శత్రుజాలములచేతన్ ధూతధూర్తప్రజా.

159


సీ.

నీప్రతాపము నోర్వనేరక రిపులక్ష్మి నీవెల్లగొడుగుక్రొన్నీడ నిలిచె
నీకృపాణీధార నిచ్చెనగా నెక్కె సీవలపటిమూఁపు నేలగోల
నీగుణగంధ మానెడువేడ్క సుజనషట్పదములు నీదండఁ బాయ వెపుడు
నీవితీర్ణికి నోడి నీరాకరము నీదుదానాంబుధారలఁ దగులుకొనియె
నిన్ను వర్ణింప నెవ్వారు నేర్చువారు, దానవాన్వయసౌధకార్తస్వరఘట
నిన్నుఁ జూచినదివసంబు నిఖలభోగ, భాగ్యసౌభాగ్యములకుఁ జేపట్టు గాదె.

160


క.

నీరాంజలిఁ దృష్ణాతుర, పూరుషు లాసించులీలఁ బోరుల నిన్నున్
వైరిజనహరణమునకుం, గోరెడుమాకోర్కె నేఁడు కొనసాగెఁజుమీ.

161


క.

మాదానవపతి నాతో, నాదగునందనులు వినయనయశాలులు ప్ర
హ్లాదుఁ డనుహ్లాదుఁడు సం, హ్లాదుఁడు హ్లాదుండు ననుట నవి ఫలియించెన్.

162


క.

హరిహయశిఖయమసురరిపు, శరధిపపవమానశంభుసఖశంకరులన్
దురమునఁ గింకరులం బలె, శరతాడనపీడ నొంపఁ జను నీ కనఘా.

163


క.

వంచినతల యెత్తనిన, క్తంచరులకు నేఁడు గలిగె దానవవర య
భ్యంచిత జము నీదుభు, జాంచలకరవాలకీల యలరుటకతనన్.

164


శా.

పాతాళంబును భూతలంబు దివియుం బాలించె మీతండ్రి నీ
వాతీండ్ర న్వెలుఁ గొందియున్కి సుభటాహ్లాదంబు నొందించె నీ
వాతంకంబులు మాన్చి రక్షణము సేయం బాడి యీదానన
వ్రాతంబుం బరిపంథిమర్దనవిధావైదగ్ధ్యహృద్యంబుగన్.

165


క.

నావిని ప్రహ్లాదుఁడు ర, క్షోవంశాచార్యుఁ బల్కు సుజనస్తుత నీ
పావనకటాక్షవీక్షా, శ్రీవైభవ మిట్లు నాకు సిరు లొనగూర్చెన్.

166