పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 5-6

నారసింహపురాణము. ఆ - 4

313


క.

కరిపతి దూలిన నిర్జర, [1]పరివృఢుఁ డరదంబు నెక్కి భాసిల్లుటయున్
హరి డిగ్గి దానవాధీ, శ్వరుఁడు న్రథమెక్కె, విజయశంఖము లులియన్.

141


వ.

పావకపాథోధిపతి ప్రముఖదిక్పాలపాలితం బగుగరుడగంధర్వకిన్నరకింపురుష
సేనాకలాపంబు లాపురందరుం బొదివికొని యుండెఁ, గాలజంఘ కాలదంష్ట్ర
కాలకేయ శంబర దీర్ఘజంఘ సూచీముఖ వామనాది పలాదులు, ప్రహ్లాదునకు
బాసట యై యాహ్లాదంబు సేయుచుండి రయ్యెడ.

142


సీ.

జంభశుద్ధాంతరాజనిభాననాఘనస్తనహారహారియై తనకు నెద్ది
పాకకోకస్తనీశోకానలోద్భూతిసామిధేనీస్ఫూర్తి జరగు నెద్ది
బలవధూదరహాసభాసమానమృణాళఖండనహంసమై యుండు నెద్ది
నముచిమానవతీజనప్రేక్షణాంజనతిమిరేందుకాంతియై యమరు నెద్ది
యట్టివజ్రంబుఁ గెంగేల హరిహయుండు, పూనుటయుఁ బాశుపత మెత్తెఁ బూర్వదివిజుఁ
డమ్మహాయోధవీరులయాగ్రహమున, నిగ్రహము నొందె నల భూతనివహమెల్ల.

143


క.

బలరిపువజ్రము దానవ, కులతిలకము పాశుపతము గొదకొని పెనఁగన్
జలజల విలయానలకణ, ములు దొరఁగెన్ జగము లొరగె మురముర వెరిఁగెన్.

144


వ.

అయ్యవసరంబున నయ్యాతుధానప్రధానపురుషు లగువామన వ్యాఘ్రగ
మన శిఖావళప్రముఖు లగునిశాచరవీరులు ఘోరాకారు లై గండశిలల
ఱువ్వియుఁ గొండ లెత్తి వైచియుఁ దరుషండంబుల నొండొండ మోదియు
నాదిత్య [2]వరూధినికి నిరోధంబు [3]గావించి రప్పు డప్పూర్వకకుప్పతియను
మతి ననలుండు కనలి విశాలజ్వాలాజాలంబు నిగిడించినం జిమిడియుఁ
జీకాకుపడియునుం గమరియుం గాలుమట్లం బోయియును నుడికియు నోటఱి
యుం గలంగియు నలంగియుం గూలియుం దూలియు వావిచ్చియు నొచ్చి
యుఁ బూర్వవియచ్చరనికరంబు కరంబు సంక్షోభించె నాసంరంభంబు జగ
త్రయసంధినిర్భేదననిష్ఠురం బగుచు నుండె వెండియు.

145


గీ.

దేవవిభుతోడ దానవాధిపుఁడు పోరెఁ, గడిమిఁగరితోడఁ బోరుసింగంబుఁబోలె
మదము విడనాడి సత్త్వసామగ్రి విడిచి, విఱిగె విబుధేంద్రుఁ డసురేంద్రువేగమునకు.

146


క.

సురపతి దెరలినఁ దెరలె, న్సురబలములు జలధియుబ్బు సొరిగినతరిఁ బూఁ
దెరలు గరువంబు సడలిన, వెరవునఁ జింతావివర్ణవివృతముఖము లై.

147


గీ.

ఆహిరణ్యకశిపునాత్మసంభవుఁ డాప్త, బలముతోడ బాహుబలముతోడ
సురపురంబు సొచ్చి సుఖముండె ననుటయు, శౌనకాదిమునివితాన మపుడు.

148
  1. పరివృషుఁడు
  2. వరూధంబునకు నిరోధంబు
  3. గావించ్చె, నప్పుడు