పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 5-6

నారసింహపురాణము. ఆ-4

311


క.

గుడినుండి కోయఁ జూచెదు, గుడిత్రాళ్లను మమ్ముఁ గూడుకొని వర్తిలి మా
కడఁ జెట్టుగట్టి పొత్తునఁ, గుడిచితి విన్నాళ్లు దుష్టగుణ మిది తగునే.

124


క.

భల్లూకచర్మ ముదికినఁ, దెల్ల నగునె దుష్టకష్టదితికులజుఁడ వీ
వుల్లంఘించుచు సుమనో, వాల్లభ్యము నొందఁగలవె వక్రవిచారా.

125


వ.

అనిన దనుజరాజతనూజుం డొం డాడనేరక వదనమండలంబు వంచి మిన్నక
యుండినం దద్వైలక్ష్యం బుపలక్షించి యతనిపితృవ్యుం డగు ధూమ్రాక్షుండు
సహస్రాక్షుతో నిట్లనియె.

126


ప్రహ్లాదుండు నిరుత్తరుం డైన నింద్రునకు ధూమ్రాక్షుం డుత్తర మిచ్చుట

ఉ.

మాటలు నేర్తు నే ననుచు మాటికి మాటికి నుగ్రసంగరా
స్ఫోటితశత్రు వైన దనుపుత్రకుమారను మీఱి పల్కుఝం
ఝాటము గీటముం దగునె యద్భుతవిక్రమశాలికి న్నిరా
ఘాటభుజాసిపాటవము గల్గినఁ జూపుము శక్ర యిక్కడన్.

127


సీ.

నాకపట్టన మెల్ల [1]డాకమై భేదించి నందనవనమును నఱకివైచి
సిద్ధరసంబులు చీకాకుపడఁజేసి తెఱవల నందఱఁ జెఱలువట్టి
హరిదంతిదంతకుంతాగ్రంబు లగలించి గ్రొచ్చి పెన్నిధు లెల్లఁ గొల్లలాడి
పరమేశసఖుని పుష్పకము గైకొని జగద్విదితంబుగా నేకవీరుఁ డైన
యాహిరణ్యకశిపుఁడు మాయామనుష్య, మృగముచే దైవవశమునఁ దెగినకతన
నేఁడు ఱెక్కలు వచ్చెనే నిర్జరులకు, నీకు నాకేశ యింత [2]యుత్సేక మేల.

128


శా.

ఆదైత్యేంద్రుకుమారుఁ డై వెలయు ప్రహ్లాదుం డమర్యాద బా
హాదర్పంబున నెల్లభూపతులఁ గయ్యాలం దిగంద్రోచి నేఁ
డీ దేవావసధంబుఁ గైకొనఁగ ని ట్లేతెంచె నీవిక్రమ
శ్రీదాక్షిణ్యపరాయణుం గెలువ నేర్తే ధూర్తచర్యానిధీ.

129


చ.

సురవర నీపరాక్రమముచొప్పు సమస్తము నీఱు గప్ప సం
గరమున దానవాకలితకర్కశబాణము లోర్వలేక బ
ల్బిరు దని విష్ణుఁ జూపి వెఱపించెద విక్కడ మమ్ము నక్కటా
యురుతలపాదఘట్టనల నూఁగునె తూఁగునె సాలసాలముల్.

130


క.

త్రిజగములుఁ జుట్టి యెవ్వఁడు, భుజబలమున నాక్రమించుఁ బూర్ణోదయుఁ డై
విజయంబుఁ గన్నయవ్విభు, భజియింతురు దేవుఁ డనుచుఁ బ్రజ లమరేంద్రా.

131
  1. దాకమై భేదించ్చి
  2. యుద్రేకము