పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


వంతల దుంతలుంబోలెఁ గాంతి దఱిఁగి [1]సురిగ హరిగ కరవాలంబు గిరుసు
పంకిణియు డొంకెన జముదాడి కొంగవాలు హలాయుధంబు మొదలుగా
నాయుధంబులు విడిచి పదాతు లనవదాతవదను లై పెదవులు దడుపుచు
నొదిఁగిరి రాహుత్త‌విహీనంబు లగు మరుత్తమావులు ప్రోవులుగట్టి కల్యాణ
పల్యాణప్రముఖంబు లగు సవరణలతోడ నేడఁజూచినం దామయై సము
ద్రంబునందు నవిసినకలంబుల చందంబున యథాయథ లై యవధిం బొరలెఁ
బృథులంబు లగురథంబు లుపభుక్తపూర్వపుణ్యఫల పురుషవిముక్త సురపుర
విమానంబులుం బోలె నవమానంబులకు నధిష్ఠానంబు లగుచు నున్నయవి
యున్నయట్లనె వన్నె దఱిఁగి యొఱగెఁ గామలకుఁ బాసిన హేమచ్ఛత్రంబులు
మృత్యుభుక్తిపాత్రంబులు భుక్త్యంతంబునం బోవైచిన యని యివి యన రవణంబు
లుడిగి బెడంగు దఱిఁగె నంచలు చంచువులం ద్రుంచివైచిన నెండవడి
బడలు పుండరీకంబులలాగున ననాళంబు లగుచమరవాలంబులు సమర
సరిత్తీరంబునకు జరత్కాశప్రసూనంబు లై ది...... నుడిగి కానంబడియెఁ
గంకణాంగదగ్రైవేయకటకతులాకోటికోటులు విటతాటం బై యుత్పాతకాల
పతితమహోల్కాజాలంబుల గేలిసేయుచు నేలయెల్లనుం దామ యై యప
హృతరామణీయకంబు లై విశీర్ణంబు లయ్యె నెత్తు రొత్తరించె నెమ్ములు దుమ్ము
లయ్యెఁ గండలు గుండుగూలెఁ బ్రేగులు ప్రోగువడియె వాద్యంబులు ప్రద్యో
తంబయ్యె(?) నెయ్యెడఁ జూచిన దయ్యంపుగుంపులు క్రొత్తయెఱచిగరచిలు
పులు(?) మేయుచు నర్తింపం దొడంగె నయ్యెడ.

89


సీ.

గగనగంగాపయఃకాండంబుఁ గబళించు నిబిడధరారేణునిచయధార
గుభుగుభుల్లున హరిత్కోణసామజకర్ణవిదళనం బొనరించురొదలకతన
వియదంబురాశినవీనవిద్రుమలతాతతి యైనయాయుధద్యుతివిభూతి
నజునిసర్గమునందు నవతారమందు జంతువులట్లు తలచూపు వివిధసేన
రాక్షసోద్రేకనిర్వాపణక్షణోగ్రు, డగు సహస్రాక్షుదృష్టికి నపగతారి
యయ్యు భువనంబు శాత్రవవ్యాప్తమైన, కరణిఁ గనుపట్టె ఘూర్ణితాకార మగుచు.

90


క.

మరుదీశవిశ్వవసుకి, న్నరనరగంధర్వయక్షనాగఖచరు లా
హరిహయునిరుగడల భయం, కరరోషోదగ్రు లగుచుఁ గమియుట యొప్పెన్.

91


క.

పాకారి యిట్లు విజయ, శ్రీకాంతుం డగుచు నడువఁ జెదరి బెదరి ముం
జీకాకుపడినరక్షో, నీకిని ప్రహ్లాదుఁ గాంచి నివ్వెఱ గదురన్.

92
  1. సురిగె హరిగె