పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతేకాదు అస లంతకుపూర్వమే మొత్త మసురులందరికీ విష్ణుసత్వవిజ్ఞానోదయాన్ని కలిగిస్తానని విస్పష్టంగా పేర్కొంటాడు.

"అఖిలవేదాంతవేద్య విశ్వాత్మశీల
మైన సుత్సత్వవిజ్ఞాన మసురులకు జ
నింపఁజేసెద మన్మనోన్నిద్రశక్తి
ఘనతరంబైన సంవృతి క్రమమునందు."

(నార. 415. పు. 94. ప.)

ఈ లక్ష్యసిద్దికై మహావిష్ణువు అనేకానేకావతారాలు ధరించాడు. ధరిస్తాడు కూడా.

నరసింహకవి హిరణ్యకశిపుని శక్తిమత్తత్వాన్నిగురించి అతనిచేతనే చెప్పిస్తూ "గుణాన్వితత్వంబు వలన మానతయు దోషాన్విరత్వంబు వలన నమానతయు నగు; నిశ్చితంబైన మానత లేదు;" (నార. 431. పు. 169. వ.) అని మానతామానతల భిన్నత్వాన్ని ఉగ్గడించినా మానతకు నిశ్చితత్వం లేదు పొమ్మన్నాడు.

ప్రహ్లాదుని జననానంతరం అతడు ఓంకారనాదోచ్చారణ చేస్తూ "సో౽హం" - "హంసః" అన్న శబ్దాలలోని లోచనబంధయోగానికి సంబంధించిన బ్రహ్మను భవానుభూతితోపాటు అమృతసిద్ధిత్వాన్ని సైతం అధ్యాత్మానుభూతిపరంగా నరసింహకవి తేటతెల్లంగా వర్ణించాడు. (నార. 434, 435. పు. 182. వ.)

ప్రహ్లాదుడు తండ్రితో మాట్లాడుతూ మోక్షదాయకమైన దేవవేదకర్మపూర్ణమైన సద్విద్యగురించి చెపుతూ మోక్షభిన్నమైనదంతా కేవల శిల్పంవంటిదంటాడు.

"ఏది బంధకంబు గాదిది సత్కర్మ
మరయ మోక్షమునకు నయ్యె నెద్ది
యది సువిద్య దుఃఖ మన్యకర్మము శిల్ప
మన్య విద్య నిశ్చయముగ వినుము."

(నార. 437. పు. 195. ప.)

వాస్తవం పరిశీలిస్తే దేవతలకు ప్రతికృతులైన శిల్పాలే అయినా, ఆ మహావిష్ణుమూర్తి శిల్పమే అయినా కారుకులు రూపొందించినవి మాత్రమేకావు. అసలు శిల్పులు రూపొందించినవే అయినాసరే శిల్పాలు శిల్పాలే. విష్ణువు సర్వాంతర్యామి అయినప్పటికీ యెంత ప్రాణప్రతిష్ఠ జరిగిన శిల్పమైనా అసలు విష్ణువుకు దీటురాదు.