పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాబట్టి దీనిని తొలి యేకాదశి అంటారు. ఇదే శయన ఏకాదశి కూడా. తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాటికి విష్ణునక్షత్రాలు పశ్చిమాన అంతర్హితమవుతూ వుంటాయి. అందువల్ల భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా పేర్కొంటారు. శ్రావణ భాద్రపదమాసాలలో, భాద్రపద శుక్ల ఏకాదశినాటికి ఉత్తరదిక్కునుండి పశ్చిమదిక్కుకు వొత్తిగిలినట్లు, ప్రక్క మారినట్లు విష్ణునక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి యిది సార్థకంగా పరివర్తన ఏకాదశి అనబడింది. తరువాత సరిగ్గా రెండునెలలకాలం పరివర్తనస్థితిలోనుండి దిశమార్చి కార్తీక శుక్ల ఏకాదశినాడు తూర్పుదిక్కున సూర్యోదయంకంటే పూర్వం విష్ణునక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి కార్తీక శుద్ద ఏకాదశిని ఉత్థాన ఏకాదశి, బోధన ఏకాదశి అని వ్యవహరించడం జరిగింది. కార్తీక శుక్ల ఏకాదశినాడు ఆ మహావిష్ణునక్షత్రాలు నిద్రనుంచి లేచినట్లుగా కనిపిస్తాయి. ఈ యేకాదశినే ప్రబోధినీమహిమగా (నార. 270. పు.) నరసింహకవి రుక్మాంగదచరిత్రలో వర్ణించాడు. కార్తీక శుక్ల ఏకాదశి తరువాత మార్గశిర శుక్ల ఏకాదశినాడు విష్ణునక్షత్రాలలో ఉపరి అర్థభాగనక్షత్రాలు మాత్రం కనిపిస్తాయి. వాస్తవానికి నరసింహకవి పేర్కొన్నట్లు "కార్తీకసమంబైన మాసంబును, గృతయుగసమంబైన యుగంబును," (నార. 260. పు. 337. వ.) లేవన్నట్లుగా కార్తీకమాసానికున్న ప్రత్యేకత మరే యితరమాసానికీ లేదు. అయితే కృష్ణుడు భగవద్గీతలో "మాసానాం మార్గశీర్షోహమ్" అని పేర్కొనడం అర్జునునికి గీతోపదేశకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణుడు అనూరుడైన రథసారథిగావుండి పేర్కొనడాన్ని దృష్టిలో పెట్టుకొని మార్గశిరమాసానికి వైశిష్ట్యం యివ్వబడిందే కాని కార్తీకంకంటే మార్గశిరం గొప్పదని కాదు. పుష్య శుక్ల ఏకాదశి నాటికి, విష్ణుమూర్తి నక్షత్రాలన్నీ సూర్యోదయానికంటే ముందు తూర్పున ఉదయిస్తాయి. నక్షత్రరూపుడైన పరిపూర్ణమహావిష్ణువును మనం పుష్యశుద్ధ ఏకాదశినాడు తెలతెల్లవారే సమయంలో చూడవచ్చును. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని మన ప్రాచీనులు పేర్కొన్నారు. ఇదేవిధంగా మాఘశుద్ధ ఏకాదశిని భీష్మైకాదశిగా, ఫాల్గుణశుద్ధ ఏకాదశిని కల్యాణ ఏకాదశిగా, చైత్రశుద్ధ ఏకాదశిని (శ్రీరామపరంగా) సైతం కల్యాణ ఏకాదశిగా, మరికొందరు వైశాఖ శుక్లఏకాదశిని (రాధామాధవ పరమైన) కల్యాణ ఏకాదశిగా భావిస్తారు. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు త్రివిక్రమైకాదశిగా భావించి మహావిష్ణువును త్రివిక్రమునిగా పూజిస్తారు. (చూడు నక్షత్రములు, 157. పు. నుంచి 164. పు. వరకు).

నరసింహకవి సూర్యోదయహీనమైన దశమిని ఏకాదశీసంకలితమైనప్పటికి కూడా పుణ్యప్రదం కాదని త్రోసిపుచ్చాడు.