పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పటినుండి తులసి విష్ణ్వర్చనలో ముఖ్యస్థానాన్న్ని పొందడమేకాక ప్రత్యేకించి విష్ణుమంత్రజపంలో తులసిపూసలమాలకు ఒకానొక విశిష్టప్రతిపత్తి లభించింది. ఈ కథనుబట్టి చూస్తే రామావతారానికి మూలం తులసిగా కనిపిస్తుంది కాని గతంలో నారదునిగురించి తెలుసుకున్న విశేషాలలో రామావతారానికే కాక, అటు లక్ష్మికూడా రాక్షసగర్భంలో పుట్టి రాక్షసులచేత బాధింపబడుతుందని నారదపర్వతులవల్ల శాపాలు కారణంగా సీతారాముల గాథ జరిగినట్లు గుర్తించాము. ఏది యేమైనా ప్రాచీన ఆయుర్వేద వైద్యశాస్త్రాల ప్రకారమే కాకుండా ఆధునిక వైద్యశాస్త్రాల దృష్ట్యాకూడా, తులసి కొకవైశిష్ట్యం వున్నది. తులసిలో వున్న మహత్తరమైనశక్తి హృచ్ఛక్తిని పెంపొందింపచేయడం. మంత్రసిద్ధులకై చేసే మామూలుజపంలో కాని, ప్రత్యేకించి మానసికజపంలో కాని తులసి హృచ్ఛక్తిని పెంపొందించడంద్వారా మానవులలో మహత్తరమైనశక్తిని ఉద్భవింపచేయగలదు. అందువల్లనే తులసీమాలధారణకు వైశిష్ట్యం యేర్పడింది. శ్రీకృష్ణుడు బృందావనవిహారిగా వర్ణింపబడడంలోకూడా తులసికున్న హృచ్ఛక్తిమత్తత్వం సువ్యక్తమవుతుంది.

ఏకాదశీమాహాత్మ్యం గురించి, వైశిష్ట్యంగురించి నారదీయపురాణంలో రుక్మాంగదచరిత్రలో విపులంగా వర్ణించబడింది. తులసీమాహాత్మ్యం వర్ణనం తరువాత ఏకాదశీవ్రతప్రాశస్త్యంగురించి యీ క్రిందివిధంగా శ్రుతి ప్రమాణంగా పేర్కొనబడింది.

"ఏకాదశి వంటి వ్రతం
బేకలుషాత్ముండు సేయఁ డిల నెన్నిక దా
నా కలుషాత్ముని సుకృతం
బా కడ భస్మాహుతి యగు ననియెన్ శ్రుతియున్..

(నార. 160. పు. 61. ప.)

ఖగోళశాస్త్రరీత్యా కూడా కీర్తిశేషులు, మిత్రులు శ్రీ గొబ్బూరి వెంకటానంద రాఘవరావుగారు "నక్షత్రములు" అన్నగ్రంథంలో వివరించిన విధంగా మహావిష్ణుపరంగా ప్రతి ఏకాదశికి ప్రత్యేకించి ప్రతిమాసంలోనూ ప్రతి శుక్లపక్ష ఏకాదశికి విశేషమైనస్థానం వున్నది. ఆషాడ శుక్ల ఏకాదశినాడు సూర్యాస్తమయం కాగానే మహావిష్ణు నక్షత్రాలు ఉత్తరాకాశంలో శయనించినట్లుగా చక్కగా కనిపిస్తాయి. చాతుర్మాస్యవ్రతం యీ యేకాదశినుంచే ప్రారంభమవుతుంది. విష్ణుశయనమాసాలలో నాల్గింటిలోనూ యిది మొట్టమొదటి యేకాదశి