పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతర్ముఖుడై తపోనిధిగా కాలం గడిపినట్లు కనిపిస్తున్నది. రామావతారకాలంలో రాముడు వాలిని సంహరించిన సందర్భంగా వాలి సుగ్రీవులకు భార్యగా విరాజిల్లిన తారశాపం కారణంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడుగా అవతరించిన తరువాత అవతారాంతిమదశలో - త్రేతాయుగంలో వాలిగా జీవించి, ద్వాపరయుగంలో ఒకబోయవాడుగా జన్మించిన వ్యక్తి వేసిన బాణాహతితో పాదాంగుష్ఠవిచ్ఛేదనం జరిగి శ్రీకృష్ణావతారం ముగుస్తుంది. శ్రీకృష్ణుడు ఒకచెట్టుక్రింద కాళ్లు చాపుకొని కూర్చొని వూపుకుంటూ పిల్లనగ్రోవి ఊదుతూ వుండగా దూరంగావున్న బోయవాడు కదిలాడుతున్న కాలిబొటనవ్రేలిని చూచి చెవులపిల్లి (కుందేలు) చెవి ఆడిస్తున్న దనుకొని గురిచూచి బాణం వేయగా ఆ బాణం శ్రీకృష్ణుని బొటనవ్రేలికి తగిలి, కృష్ణుడు అవతారం చాలిస్తాడు.

మహావిష్ణువు

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఖగోళశాస్త్రరీత్యా గాని, మంత్రశాస్త్రరీత్యా గాని, మరేదృష్టితో చూచినా విష్ణువును ఒక అసాధారణమై, అపూర్వామేయమైన స్థానం వున్నదని మనం ఆమోదించక తప్పదు. శ్రీ మహావిష్ణువు గురించి వేదవాఙ్మయంలో బహుముఖంగా వర్ణించబడింది. శ్రీసూక్తం బహుముఖాలైనవిశేషార్థాలతో లక్ష్మీపరమై అవతరించగా, అదేవిధంగా పురుషసూక్తం మహావిష్ణుపరమై అవతరించింది. గతంలో అనేకమంది ప్రాచ్యపాశ్చాత్యపరిశోధకులు వేదకాలంలో మహావిష్ణువుకంటే ఇంద్రుడికి మహోన్నతస్థానం యివ్వబడిందనీ, ఆకాలంలో ఇంద్రునికంటె విష్ణువు తక్కువవాడుగా చూడబడ్డాడనీ అభిప్రాయపడడం జరిగింది. వీరిలో యీ అభిప్రాయం కలగడానికి మూలకారణం విష్ణు పర్యాయపదాలలో "ఉపేంద్ర" శబ్దం ఉపయోగించబడడమే. ఉపేంద్ర శబ్దానికి "చిన్నయింద్రుడు" అని ఈపరిశోధకవిమర్శకు అర్థంచెప్పుకొని, విష్ణువును ఇంద్రునికంటె తక్కువవానిగా వేదకాలంలో భావింపబడినట్లు పేర్కొన్నారు. ఇంద్రుడు వర్షాధిదేవత కావచ్చును. వర్షాలకోసమై ప్రాచీనకాలంలో కొందరు 'ఇంద్రస్తుతి' అత్యధికంగా చేసివుండవచ్చును. వాస్తవానికి ఆర్షవిజ్ఞానందృష్ట్యా వర్షాధిదేవత వరుణుడే కాని ఇంద్రుడు కాడు. అసలు 'ఉపేంద్ర'శబ్దానికి ఆర్షవిజ్ఞానందృష్ట్యావున్న అర్థమే వేరు. ఉపేంద్రుడంటే చిన్నయింద్రుడని ప్రాచ్యపాశ్చాత్యపరిశోధకవిమర్శకులు చెప్పిన అర్థం పూర్తిగా పొరపాటు. నరసింహకవి నారదీయపురాణంలో హిరణ్యకశిపుడు విష్ణువును కించపరుస్తూ, తూలనాడుతూ, ప్రహ్లాదునితో సంభాషించిన సందర్భంలో "అటు పల్కెద వేనిచ్చిన సుఖంబు విడిచి యుపేంద్రునివలన నేమి యనుభవించెదవు? నాయాజ్ఞ శిరంబునం దాల్చిన దేవేంద్రునిం జూడవే?" (నార. 473. పు. 125. వ.)