పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయించి పరిపాలించగల సమర్థుడు ధర్మాంగదుడు. మీదు మిక్కిలి పితృవాక్యపరిపాలకుడు. రుక్మాంగదుడు అకలంక అచంచల మహావిష్ణుభక్తి వ్రతనిష్ఠుడు. రుక్మాంగదుణ్ని విష్ణుభక్తినుంచి మరలించి, అతని ధ్వంసనార్థమై బ్రహ్మ మోహినిని సృష్టించి కర్తవ్యం ఉపదేశించి పంపిస్తాడు. మోహినీ రుక్మాంగదుల వివాహం అయిన తరువాత కొంతకాలానికి మోహిని బ్రహ్మ కిచ్చిన మాటప్రకారం రుక్మాంగదుని విష్ణువ్రతానికి భంగం కలిగించాలని విశ్వప్రయత్నం చేస్తుంది. మోహిని కోరిక మేరకు సప్తద్వీపవిజేతయై, పితృవాక్యపరిపాలకుడై తండ్రిని మించిన కొడుకనిపించుకొన్న ధర్మాంగదుణ్ని రుక్మాంగదుడు వధించడానికి సైతం సంసిద్ధుడవుతాడు తప్ప, విష్ణుపరమైన ఏకాదశీవ్రతనిష్ఠను విసర్జించడానికి మాత్రం ఆమోదించడు. మోహిని కోరికప్రకారం, ధర్మాంగదుని వధకు రుక్మాంగదుడు సంసిద్ధుడు కాగా, అతని విష్ణుభక్తితత్పరతకు బ్రహ్మాది దేవతలంతా ఆశ్చర్యపడి ప్రత్యక్షమై యెటువంటి విపరిణామం జరుగకుండా సంరక్షిస్తారు. ఈ రుక్మాంగదునిచరిత్ర సావిత్రీ సత్యవంతుల జీవితం తరువాత జరిగినట్లు కనిపిస్తున్నది. రుక్మాంగదునిభార్య అయిన సంధ్యావళి మోహినిని అనునయించే సందర్భంలో

"భర్త సువ్రత మొనరింప భార్య యాత్మ
నానుకూల్యంబు పాటించి యాచరించి
యందుఁ బోఁ బుణ్యలోకంబు లమితకీర్తి
వెలయు సావిత్రివోలెఁ బవిత్ర యగుచు."

(నార. 284. పు. 102. ప.)

అని సావిత్రిని ఉపమానంగా పేర్కొనడం ద్వారా, సావిత్రీ సత్యవంతులకథ రుక్మాంగదునికంటె ప్రాచీనమైనదని నరసింహకవి తెలియచేశాడు.

రుక్మాంగదుని కుమారుడైన ధర్మాంగదుడు తనకు తొమ్మిదవయేటనే మహాబలపరాక్రమవంతుడై మలయపర్వతంమీద వున్న విద్యాధరుల్ని యుద్ధంలో గెల్చి మణులతో సహా ఆ విద్యాధరుల భార్యలను తీసుకొనివచ్చి మోహినికి సైరంధ్రులుగా నియమించాడు. సామాన్యంగా మణిత్రయమని మణులు త్రిసంఖ్యకే పరిమితా లైనట్లు ప్రసిద్ధి. అవి కౌస్తుభం, చింతామణి, శ్యమంతకమణులు. ఇవికాక సూర్యకాంతమణులు చంద్రకాంతమణులు వేరుగా విశేషంగా వున్నాయి. కౌస్తుభమణి విష్ణువు ధరించేది కాబట్టి దానిని ధర్మాంగదుడు తీసుకొని రాలేదన్న విషయం స్పష్టం. ధర్మాంగదుడు తెచ్చిన మణులలో విభిన్నాలైన అపూర్వశక్తివంతాలైన పెక్కుచింతామణులు తెచ్చినట్లు స్పష్టపడుతున్నది.