పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/687

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బున జనించినవాఁడు; నీ వెఱుంగకయున్న విష్ణు నెవ్వ రెఱుంగుదురు?
విష్ణుప్రభావంబునందు నీ కీవిశ్వాసము గల; దది పరీక్షింప సుత
ప్రియుండవైన నీవు సర్పాదులఁ బ్రయోగించి నాకు భగవద్ద్విశ్వాసంబు
గల్పించితివి; నామీఁద దయ గల్గఁగా నే భగవంతుని విడువుమని నీ వనిన
కతన నాగ్రహంబు పుట్టెను; బాలుఁడు సేయుమనిన పని సేయండు;
అట్లు గాన నే బాలుండ; విష్ణువును విడువను; మోక్షంబు గోరఁగాఁ
గృత్యాదులచే నవధ్యత్వ మాంతరీయకఫలం బమృతమునకునై
సముద్రము మథింపగాఁ బారిజాతాదికము దొరికినట్లు; గాన నిట్లు
మోక్షైకచిత్తులమై యత్నము సేయుచున్న మాకు దివ్యసిద్ధులు లభిం
చెను; పుణ్యమువలనఁ బుణ్యఫలము గల; దందున నల్పులు సంతుష్టు
లగుదురు; మహామతి ముక్తియే కోరు; సురపతి యమృతముంబలె;
నింక నిన్ని యననేల? నీ వెంత చేసిన నవి నన్ను నేమి చేసె? హరిస్మర
ణంబు గూడదని చలంబునం బల్కిన నేమి! నీమాట నీమనంబునకు
వచ్చునె? మనస్సునకు వచ్చిన మాటయే పల్కండేని యాత్మచోరుండు;
నీకు విష్ణువునెడఁ జలమాత్సర్యంబులయందు నేమి యపరాధము?
నీస్వభావ మది; చరాచరజగత్యంతఃప్రవర్తకుండై యచరుండైన
విష్ణువు నవిద్యాంధు లెవ్వరు గెల్చెద! రనన్యమనస్కులై భజించిన
వారు గెల్తురు; ఇంక నీకు నేమి విన్నవించెద" ననిన మాటలు
శిష్టుండు పతితమందిరంబునం బోలెఁ జొరవయ్యె; నప్పుడు.

218

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని మందిరాగ్రమునుండి త్రోయించుట

సీ.

అసురనాయకుఁడు క్రోధావేశవిస్మృతా
                       ర్వాక్తనశ్రముని, తద్వైష్ణవావ
తంసు, నవధ్యుఁగాఁ దలఁచి క్లేశము నంది,
                       జంకి, నిజాస్థానచయమహోచ్ఛ
చిత్రసత్ప్రాసాదశృంగంబుమీఁదట
                       నుంచి, యాతనిఁ బడ నుగ్రశక్తిఁ
ద్రోయింప నవ్వేళఁ దోయజనయనుండె
                       తానని యాత్మ నెంతయును నిలిపి