పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలుపెట్టి, కొద్దిసేపట్లోనే తాను వంచింపబడినట్లు తులసి గ్రహిస్తుంది. గ్రహించినవెంటనే గభుక్కున లేచి, దూరంగా నిలబడి, వికలమనస్కతతో చూస్తూవుంటుంది. అప్పుడు శివుడు లేచి, ఒకవేళ తులసి శపిస్తుందేమోనని సందేహించి తాను శివుడనని, తనను వివాహం కాగోరి నీవు తపస్సు చేయడంవల్ల యిది జరిగిందనీ, శంఖచూడుడు నిన్ను వివాహం చేసుకోవాలని తపస్సు చేయడంవల్ల అతనితో వివాహం జరిగిందనీ వివరిస్తాడు. అప్పుడు తులసి తానుకోరిన విష్ణువే శివునిరూపంలో వచ్చాడని గ్రహించి సంతోషపడి ఆమె ఆ శరీరాన్ని విడిచి వృక్షరూపం ధరించింది. శివపురాణాన్ని బట్టి చూస్తే తులసిపుట్టుక మరొకవిధంగా తెలుస్తున్నది. కాలనేమికి 'వృంద' అనే పుత్రిక పుట్టింది. వృంద భర్త జలంధరుడు. జలంధరుఁ డొకసారి పార్వతివద్దకు శివునిరూపంలో వెళ్ళి, ఆమెను వంచించుదా మనుకున్నాడు. ఈవిషయం గ్రహించిన పార్వతి జలంధరుని భార్యఅయిన వృంద పాతివ్రత్యాన్ని భంగపరచవలసిందిగా విష్ణువును కోరుతుంది. జలంధర మహేశ్వరులకు యుద్ధం సంభవించింది. తనభర్త మహిషాన్నెక్కి దక్షిణదిశవైపు వెళ్ళుతున్నట్లూ, అతనినగరం తగలబడుతున్నట్లూ వృందకు స్వప్నాలు వచ్చాయి. ఇవన్నీ అపశకునాలని ఆమె భావించి వ్యాకులమైన మనస్సుతో యేమీ తోచక ఉద్యానవనానికి వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు మతిస్థిమితంలేక, అడవులలోకి వెళ్లింది. ఒకచోట చెట్టుక్రింద మహావిష్ణువు వృద్ధముని రూపంలో కూర్చొనివున్నాడు. అదే చెట్టుమీద రెండుకోతులు కూడా కూర్చొని వున్నాయి. ఈ వృద్ధమునివద్దకు వృంద వెళ్లి "ఓ మునీశ్వరా! మీవంటివారికి తెలియనివి లేవు. నాభర్త క్షేమంగా వున్నాడా? లేడా! చెప్పవలసిం"దని వేడుకుంటుంది. ఆ ముని "నీ భర్త శివునివల్ల చచ్చిపోయాడని" చెపుతాడు. వెంటనే ఆమె మూర్ఛపోయి కొంతసేపటికి తేరుకొని "అయ్యా! నీమహత్వం సామాన్య మయినదికాదు. నా భర్త నెట్లాగైనా బ్రతికించండి" అని అతిదీనంగా వేడుకుంటుంది. అప్పు డతడు సరే అని, ఆమె నక్కడే వుండవలసిందని చెప్పి, సమీపంలో వున్న చెరువులో ఆ వృద్ధముని మునిగి, తానే జలంధరుని రూపం తాల్చి, వృందవద్దకు వస్తాడు. అతడు తన భర్త అని నమ్మి వృంద కౌగలించుకుంటుంది. మాయాజలంధరుడు వృందను ముద్దాడి, రతికేళిలో తేలిస్తాడు. చివరి కామె వంచింపబడినట్లు గ్రహించి శరీరత్యాగం చేయాలనే నిర్ణయానికి వచ్చి, చితి పేర్చుకొని తాను వంచింపబడడంవల్ల కలిగిన దుఃఖాన్నీ, కోపాన్నీ ఆపుకోలేక ఆ మాయాజలంధరుణ్ని "నీవుకూడా నీభార్యావియోగదుఃఖాన్ని పొంది వానరుల సహాయంతో నీ భార్యను తిరిగి పొందుతావ"ని శపించి వృంద చితిలో దూకి కాలిపోతుంది. ఆ శాపవాక్కులు విని విష్ణువు నివ్వెరపోయి నిలిచి వుండగా దేవతలంతా వచ్చి విష్ణువును యథాస్థితికి తెచ్చి, వృంద శరీరభస్మంమీద కొన్ని గింజలు చల్లారు. అవి తులసి, ఉసిరి, మాలతి, మొక్కలుగా మొలిచాయి.