పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెపుతూ భగవద్దర్శనం యేవిధంగా చేయాలో పేర్కొంటూనూ, తులసీమాహాత్మ్యం గురించి చక్కగా వర్ణించాడు. తులసీపద ఉచ్చారణతోనే విష్ణుపాదార్చనాసత్ఫలితాన్ని పొందుతాడని పేర్కొంటూ "దర్శన శ్రవణ కీర్తన పరిస్పర్శన స్మరణంబు లొనరించు జనులనెల్లఁ దులసీవనము పవిత్రులఁ జేయు వెనుకటి పదితరంబులు మీఁది పదితరములు తులసీదళంబు లెందు వసించు" (నార. 159. పు. 57. ప.) అని తులసీశక్తిని మహత్తరంగా వర్ణించాడు. ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రాలప్రకారం చూస్తే తులసి కృష్ణతులసి కాని, లక్ష్మీతులసి కాని యేదైనా అష్టాదశకుష్ఠురోగాలను నిర్మూలించడమేకాక, హృదయాన్ని బలవత్తరంగా రూపొందించి భూతాది వివిధబాధలను సైతం తొలగింపచేస్తుందని తెలుస్తున్నది. బ్రహ్మవైవర్తపురాణాన్నిబట్టి చూస్తే విష్ణుపూజలో ప్రత్యేకత వహించిన తులసికి మూలభూతమైన చరిత్ర యీ క్రిందివిధంగా తెలుస్తున్నది. లక్ష్మ్యంశతో మాధవీధర్మధ్వజ దంపతులకు తులసి అనే పేరుగల కూతురు పుట్టింది. ఈమె చిన్నతనంలోనే బదరీవనంలో ఘోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం వేడుకొనవలసిందని అంటే, విష్ణుమూర్తి తనకు భర్త అయ్యేట్లుగా వర మిమ్మని కోరుతుంది. బ్రహ్మ ఆ వరం యిచ్చి "నీవు విష్ణుశాపంవల్ల వృక్షరూపం పొంది, అతిపవిత్రతతోపాటు వాస్తవంగానే విష్ణువును పొందగలవని చెపుతాడు. తులసి విరహవేదనతో వనంలో సంచరిస్తూ వుండగా యీమెను శంఖచూడుడనే రాక్షసుడు చూచి మోహించి దరి చేరి "నీ వెవ్వరవు? ఇక్క డెందుకు తిరుగుతున్నావు?" అని సంభాషణ ప్రారంభిస్తాడు. కొద్దిసేపట్లోనే వారిరువురి మనోభావాలు వొకరివొకరు తెలుసుకుంటారు. ఇంతలో నారదుడు వచ్చి "యీ తులసికి శంఖచూడుడే అర్హుడు. యీ శంఖచూడునకు తులసియే తగును. మీ రిద్దరూ తప్పక వివాహం చేసుకోండి" అని చెపుతాడు. అనంతరం వారిద్దరూ గాంధర్వవివాహం చేసుకొంటారు. శంఖచూడు డది మొదలుకొని దేవతలతో యుద్ధం చేయడం మొదలుపెడతాడు. అనేకమంది దేవత లతనిచేతిలో ఓడిపోతారు. చివరికి కాళికాదేవి కూడా వోడిపోతుంది. దేవతలప్రార్థనమీద కుమారస్వామి రంగంలోకి వచ్చి, మూర్ఛపోతాడు. చివరికి శివుడు స్వయంగా శంఖచూడునిపై దండెత్తి అతణ్ని సంహరిస్తాడు. అనంతరం శివుడు శంఖచూడుని కవచం తీసుకొని, అతని రూపంతోపాటు కవచాన్నికూడా ధరించి తులసి యింటికి వెళ్తాడు. తులసి తనభర్త యుద్ధంలో విజయం సంపాదించి వచ్చాడని తలంటిస్నానం చేయించి, భోజనం పెట్టి పర్యంకంమీదకు చేరుతుంది. వా రనేకవిధాలుగా రతిక్రీడలతో మునిగితేల్తారు. మాయారూపంలో వున్న శంఖచూడుణ్ని నిజమైన శంఖచూడుడని భావించి, సంభాషించడం