పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహోదగ్రుడై, తన సభాస్థలిలో వున్న ఒకస్తంభంలో విష్ణువును చూపవలసిందని ప్రహ్లాదుణ్ని అడుగగా విష్ణువు నరసింహావతారంలో అవతరించి హిరణ్యకశిపుని సంహరించినట్లు ప్రసిద్ధమైన విషయం. భాగవతాది గ్రంథాలలో ప్రహ్లాదాదులందరికీ నరసింహావతారంగానే విష్ణువు మొట్టమొదట ప్రత్యక్షమవుతాడు. అయితే నారదీయపురాణంలో దీనికి భిన్నంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని యమయాతనలు పెట్టి, నాగపాశబద్ధుణ్ని చేసి, సముద్రంలోకి తోయించినపుడు విష్ణువు ప్రహ్లాదునికి విష్ణుస్వరూపుడుగానే ప్రత్యక్షమై ప్రహ్లాదుణ్ని అనునయించి వరం వేడుకోమంటే నీ పాదారవిందాలు చూడడంకంటే నాకు వేరేకోరిక లేదని ప్రహ్లాదు డంటాడు. చివరికి విష్ణువు ప్రహ్లాదుణ్ని మోక్షలక్ష్మీసామ్రాజ్యపట్టభద్రుడుగా అనుగ్రహించినప్పటికి ప్రహ్లాదుడు విష్ణుపదభక్తి తప్ప వేరొకటి కోరనంటాడు. చివరికి విష్ణువు నేను క్షీరాబ్దిలో వున్నవిధంగా నీ హృదయంలో వుంటానంటూ మూడురోజులకు నరసింహావతారంలో తిరిగి నన్ను నీవు చూస్తావని యీ క్రిందివిధంగా పేర్కొంటాడు.

"ప్రియవత్స! నీకు నభీష్ట మెయ్యది యది
          ప్రాపించు; సుఖమున బ్రతుకు మింక;
నంతర్హితుండనై యరిగిన ఖేదంబు
          నొందకు; క్షీరాబ్ధి నున్న యట్లు
నీ హృదయంబున నిల్తు; లక్ష్మికి నాకు
          భక్తహృదయమె శోభనగృహంబు;
వైకుంఠదుగ్దాబ్దివాసవర్ణన నిత్య
         శోభయె తెలియ; రక్షోభయములు
తలఁగఁ జేయుదు దారుణతనువు గాన
మందిరము నిలుపుకొనఁగ మనుజసింహ
మూర్తి ననుఁ జూచెదవు; భక్తి మూఁడుదివస
ములకు నని యేగె విస్మయమున భజింప"

(నార. 501. పు. 247. ప.)

కాగా, యితరగ్రంథాలలోవలే కాక నారదీయపురాణంలో ప్రహ్లాదునికి విష్ణువు హిరణ్యకశిపుసంహారసందర్భంలో నరసింహావతారరూపంలోనే కాక, అంతకు పూర్వమే అసలు సహజవిష్ణుస్వరూపంలోనే, ప్రత్యక్షమైనట్లు స్పష్టపడుతున్నది.

పేరోలగంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని ఉద్దేశించి యీ స్తంభంలో విష్ణువును చూపించవలసిందని స్తంభాన్ని చేతితో కొట్టినట్లు, పిడికిలితో గుద్దినట్లు,