పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలితో తన్నినట్లు, గదతో మోదినట్లు వివిధగ్రంథాలలో పేర్కొనబడింది. కాని నారదీయపురాణంలో మాత్రం "అని స్తంభంబునం జూపు" మని ఖడ్గంబున స్తంభంబుం దాటించిన." (నార. 504. పు. 257. ప.) అని కత్తితో కొట్టినట్లు కనిపిస్తున్నది.

ప్రహ్లాదుని విద్యాభ్యాసవర్ణనాసందర్భంలో కాణాదాదిసిద్ధాంతాలు ప్రహ్లాదునికి పూర్వమే వున్నట్లు

"అంత నద్దైతేయుఁ డాత్మజు ప్రతిన స
        త్యము సేయఁ దలఁచి యుదగ్రబుద్ది
గురు సుగత కాణాద గిరిశార్హ దక్షపా
        ద విరించి కపిలశాస్త్రజ్ఞ నాది
నరులనందఱఁ బిల్చి వాదింపుఁ డితనితో"

(నార. 443. పు. 227 ప.)

అన్న పద్యంద్వారా స్పష్టపడుతున్నది. అయితే యీ సిద్ధాంతాలు కృతయుగంలోనే ప్రశస్తి గాంచివున్నాయని ఆధునికచరిత్రకారులుగాని, శాస్త్రజ్ఞులుగాని అంగీకరించక పోవచ్చును. కాని వేదవాఙ్మయ ఆర్షవిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశీలించినపుడు, ఆ యా అణుపరమాణ్వాది సిద్ధాంతాలు, అత్యంతప్రాచీనాలని ఆమోదించక తప్పదు.

ప్రహ్లాదుడు దైత్యకుమారులకు పరమార్థరహస్యబోధపేరుతో ఆత్మానాత్మవివేకం దగ్గరనుంచి, అణిమాద్యష్టసిద్ధులతోసహా అన్నింటినీ తిరస్కరించి అనేకతత్వవిషయాలను ప్రబోధించి "విష్ణుసేవియైన జనునకు విముక్తియే సత్ఫలంబు" అని విపులంగా, సునిశితంగా తత్వబోధ చేస్తాడు. (చూడు. నార. 480. పు. మొ. 487. పు. వరకు.)

హిరణ్యకశిపుని సంహారానంతరం నరసింహావతారంలో వున్న విష్ణువు ప్రహ్లాదుని చేరదీసి, అనుగ్రహించి, రాజ్యాధినేతను చేస్తాడు. అనంతరం ప్రహ్లాదుడు చాలాకాలం రాజ్యపరిపాలన చేస్తూ, ఆ రాజ్యభోగతృష్ణలో మునిగితేలక, కేవల జ్ఞానాచ్యుతాంఘ్రిభక్తిరాజ్యాన్ని సైతం అనుభవిస్తూ చిరకాలం జీవించినట్లు కనిపిస్తున్నది. (నార. 508. పు. 268 వ.)