పుట:నాగార్జున కొండ.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగార్జున సాగరము


భారతదేశాన్ని అతి తరచుగా పీడించే బాధలలో క్షామ బాధ చాలా ముఖ్య మయినది. పంటలు సరిగా పండక పోవడం వల్ల తగినంత ఆహారం దొరకక అనేకమంది బాధ పడుతూం టారు. మనదేశంలో ఆహారోత్పత్తి ఎక్కువ అయితేనే కాని మనకి క్షామ బాధ తప్పదు. పంటలు ఎక్కువ కావాలి అంటే ఇంతవరకూ బీడుపడి సాగులోకి రాకుండా వున్న భూమికి నీటి సదుపాయం లభించాలి. స్వతంత్ర భారత ప్రభుత్వం ఈముఖ్య సమస్యని ఎదుర్కొనే నిమిత్తం అనేక (ప్రాజెక్టులు) ప్రణాళికలు తయారు చేసింది. ప్రస్తుతం అనేక నదులలో నీరు చాలా భాగం వృథాగా సముద్రంలోకి పోతూన్నది. ఈ నదులకి అడ్డకట్టలు కట్టి వాటిలో నీటిని నిలవ చేసి మెట్ట ప్రాంతాలకి మళ్ళించి వాటిని సాగులోకి తెచ్చే నిమిత్తం యీ ప్రణాళికలు ఏర్పడినవి.

ఆంధ్రదేశంలో కృష్ణాగోదావరులు ముఖ్యనదులు. వీటిలో చాలా నీరు వృథాగా పోతూన్నది. అందుకని ప్రభుత్వంవారు గోదావరికి అడ్డకట్ట కట్టి రామపాదసాగరం ఏర్పాటు చెయ్యాలనీ కృష్ణకి అడ్డకట్ట కట్టి నాగార్జునసాగరం ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు.