పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధారావాహిక

ఈమని శివనాగిరెడి 98485 98446


అడుగుజాడల్లో ఆనవాళ్లు-3

నా జెట్టిగామాలపాడు- తంగెడ యాత్ర

కోడి కంటే వాడిగా, ఒక ఘడియముందే లేచాను. ఆదివారం అందరికంటే నాకు మరింత ఆనందాన్నిచ్చేరోజు. రోజువారీ కార్యకలాపాలకు భిన్నంగా, ఇంట్లో కూడా చెప్పకుండా పంజరం నుంచి చిలకలాగ నేను చరిత్ర-శాసనాలు అన్న రెండు రెక్కలు తొడుక్కొని ఎక్కడో దూరాన ఉన్న ఊళ్లపై, ప్రాచీనశాసన రాళ్లపై వాలుతుంటాను. ఈసారి బెజవాడ నుంచి శ్రీకృష్ణదేవరాయలు వశపరచుకొన్న దాచేపల్లి దగ్గర, కృష్ణాతీర చారిత్రక స్థలం తంగెడకు బయలుదేరా. ఉదయం ఆరింటికి దాచేపల్లి (అసలు పేరు దాసపల్లి) చేరుకొని, బ్రిటీషు కాలంనాటి రహదారిబంగ్లా ముందు ఆగి, భవనపు అందాల్ని ఆరగిస్తూ ఒక అరకప్పు కాఫీ తాగుతున్నా. పక్కనుంచి శివనాగిరెడ్డిగారు నమస్మారం అంటూ ఓ పలకరింపు. ఆయన పశువైద్యులు డా. స్వర్ణవాచస్పతి. వాళ్ల నాన్న ప్రముఖ వాస్తు-శిల్సి స్వర్ణ సుబ్రహ్మణ్య కవిగారు. భారతీయ మహాశిల్చం పేరిట వాస్తు శాస్తాలన్నింటినీ తెలుగులో 16 గ్రంధాలు వెలువరించిన శిల్చశాస్త్ర ఘనాపాఠి. వాచస్పతిగారు కూడా, రావణ బ్రహ్మ వాస్తు-శిల్చ పదనిఘంటువు, ఇంకా అనేక ప్రామాణిక గ్రంధాల రచయిత. ఇద్దరం కలసి చరిత్ర శకలాల వేటకి వెళ్లాం. స్థానిక నాగేశ్వరాలయంలో క్రీశ 1218 నాటి కాకతీయ గణపతి దేవుని మహాప్రధాని ఖీమనాయకుని దానశాసనం, పాత పెద్దకోట శివాలయంలోని క్రీశ. 14వ శతాబ్ది దేవయరెడ్డి శాసనం, ఆంజనేయాలయం ముందటి క్రీ.శ 1789నాటి వెంకన్న పంతులు నాగులేటికి మెట్లు కట్టించిన శాసనాలను, కొత్తదనం పేరిట పురాతనాన్ని పోగొట్టుకున్న గుళ్లనూచూశాం. నాగేశ్వరాలయంలోని దిక్కుమొక్కులేని నాగదేవత, వీరశిల, కుమారస్వామి శిల్పాలు జాలిగా మా వంక చూడటం తట్టుకోలేకపోయాం. కూరుకుపోయి కొన్ని పగిలిపోయి మరి కొన్ని వంగిపోయి ఇంకొన్ని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మౌనంగా బాధ్యతనుగుర్హు చేస్తుంటే గుండె బరువెక్కింది. గట్టిగా నిట్టూర్చేలోవు, వాచస్పతిగారు వీడుకోలు చెప్పి పక్కకు తప్పుకొన్నారు.

అసలు నేను చూడాలనుకొంది తంగెడ. పక్కనే పల్నాడు చరిత్రతో ముడిపడి ఉన్న జెట్టిగామాలపాడుకు నాదారి మళ్లింది. గ్రామానికి 1 కి.మీ. తూర్పుగా, కాలిబాట. అక్కడొక పాడుబడిన కోట. అక్కడక్కడా కప్పుల్లేని ఇళ్లు. తలుపుల్లేని గుళ్లు. విరిగిన శిల్పాలు, పగిలిన శాసనాలు, అరిగిన రోళ్లుు అలుపెరుగని తిరగళ్లూ. వన్నెకోల్పోయినా, పల్నాటి పౌరుషాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి. ఒంటెలా ఓగంటపాటు ఒంటరిగా తిరిగి ఒకచెట్టు కింద కూర్చున్న నాకు, క్రీ.శ.1182లో నాయకురాలు నాగమ్మ తండ్రి చౌదరిరామిరెడ్డిని ఉరితీసింది ఈ చెట్టుకిందేనేమోననిపించింది. దాంతోపాటు పల్నాటి వీరభారత ఘట్టాలు, వీరులెక్కిన గుర్రాల పదఘట్టనలు, కరవాల కరచాలనాలు, నేలకొరుగుతున్న వీర సైనికులూ, భీభత్సంగా పరుగులు తీస్తున్న ఏనుగుల ఘీంకారాలు, కుత్తుకలు కత్తిరిస్తున్న కత్తుల వికటాట్ట హాసాలు కళ్లవుందు కదలాడాయి. ఒళ్లంతా కంపించింది. నాగులేటి నాపరాళ్ల సందుల్లోంచి మెలికలు తిరుగుతూ, దానిదారిన అదిపోతున్న ఒక మెలికల పాము నన్ను మళ్లీ ఈలోకంలోకి తీసుకొచ్చింది.

చౌదరి రామిరెడ్డి చనిపోయింది ఇక్కడే. “చౌదరి” అన్న పదం ఒకప్రాంతంలో పండిన పంటలో నాలుగోవంతును పన్ను రూపంలో (చౌత్‌ + అరి = చౌదరి (ప్రభుత్వానికి జమచేసే అధికారిని సూచిస్తుంది. రానురాను అది, రెడ్డి మాదిరిగా కులవాచకమైంది. గామాలపాడు అసలు పేరు జెట్టిగామాలపాడు. కుస్తీ పోటీల్లో కండబలాన్ని గుండెబలాన్ని ప్రదర్శించే ధృఢథకాయులైన యోధుల్ని జెట్టీలంటారు. రానురాను జెట్టిగామాలపాడు, జిట్టగామాలపాడై చివరకు గామాలపాడైంది. పేరుకుపోయిన రాళ్ల గుట్టల్లోని శిల్పాలు,శాసనాల పలకరింపులు కాళ్లను కదలకుండా కట్టిపడేశాయి. పదిలపరచే ఎదలకోసం ఎదురుచూస్తున్నాయి.

గామాలపాడు శంభునిగుడిలోని క్రీశ. 1223 నాటి కుమ్మరికుంట బేతరాజు దాన శాసనం, నంది స్థంభం పైనున్న క్రీ.శ. 1290 నాటి మల్లికార్జున నాయకునికి పుణ్యంగా, దానంచేసిన దాడిపోచుంగారి శాసనం, చెన్నకేశవాలయం వెనుకున్న క్రీ.శ.1677లో బొల్లా నారశింహుడు గరుడ స్టంభాన్నెత్తించిన శాసనం, నాయకురాలు నాగమ్మ గుడిద్వార శాఖ పైనున్న క్రీ.శ 15 వ శతాబ్దిలో చెన్నమల్లికార్డునునికి ముఖమండపం కట్టినట్లు తెలిపే శాసనం, ఇరికల్లి దారిలోనున్న క్రీ.శ, 16వ శతాబ్ది గుండయరెడ్డి శాసనం, క్రీ.శ. 1312 నాటి గజసాహిణి గుయిరెడ్డి పన్ను మాన్యం శాసనాల అక్షరాలపై నా మునివేళ్లతో పలుమార్లు తడిమి, తడిమి చూశాను. తెలుగు తల్లి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

38