పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీవీ శతజయంతి ప్రత్యేకం

డా. గంధం సుబ్బారావు 791093537


పీవీ గారి సాహిత్యాభినివేశం

(గత సంచిక తరువాయి...)


అనువాదకుడుగా పీవీ

14 భాషలపై పట్టు కలిగిన పీవీ, వివిధ భాషలలోని సాహిత్యాన్ని తెలుగులోకి, హిందీలోకి, ఇంగ్లీషులోకి అనువదించారు. ఒక భాష నుంచి మరొక భాషలోకి ఆయన చేసిన అనువాదం నేరుగా రాసిన సాహిత్యం వలెనే ఉన్నదంటే, వివిధ భాషలపై ఆయన పట్టు ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

సహస్ర ఫణ్‌

విశ్వనాథ సత్యనారాయణగారి ప్రఖ్యాత నవల “వేయిపడగలు” ను “సహస్ర ఫణ్‌” పేరుతో హిందీలోకి పీవీ గారు చేసిన అనువాదం అనువాద ప్రక్రియకే తలమానికమని మెప్పు పొందింది.

స్వయంగా ఒక ఉత్తమ నవలను రచించడం వేరు, ఒక ఉత్తమమైన నవలను మరొక భాషలోకి అనువదించి, ఆ అనువాదం మూల రచనకు సమాన స్థాయిలో ఉందని భాషా ప్రేమికుల, విశ్లేషకుల ప్రశంసలు పొందటం వేరు. ఈ అరుదైన గౌరవం పీవీ గారికి దక్కడం ఆయన అనువాద ప్రతిభకు తార్మాణం.

“వేయిపడగలు” వంటి నవలను అనువదించడం కష్టతరం. ఎందుకంటే ఏ భాషారీతికైనా తేలిగ్గా ఒదిగిపోయే గ్రాంధికభాషా రచనలకు నుడికారం ప్రసక్తి ఉండదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు అట్లా వుండవు. తెలుగు దేశంలోని గ్రామసీమల్లో వుండే అతి సహజమైన తెలుగు నుడికారానికీ, శోభకు ఏతమెత్తినట్లు ఉంటాయి ఆయన రచనలు. తెలుగు సంస్కృతి, నుడికారం, పలుకుబడుల సంగమం “వేయిపడగలు”. అట్లాంటి రచనను సంప్రదాయ హిందీ భాషా రచయితలు, పాఠకులు ఆహా! అని ఆనందించేటట్లు అనువాదం చేయడం తేలికైన పని కాదు.

ఆ విధంగా “సహస్ర ఫణ్‌” అటు విశ్వనాథ వారికీ ఇటు పీవీ గారికి హిందీ సాహిత్య ప్రపంచంలో ప్రఖ్యాతిని, ప్రచారాన్ని సముపార్షించి పెట్టింది. ఎంతగా అంటే అచ్చయిన రెండు వేల ప్రతులు నాలుగైదు నెలల్లోనే అమ్ముడు పోగా, 1972 ఫిబ్రవరి లో ద్వితీయ ముద్రణ వెలువడింది. అంతేకాక “సహస్ర ఫణ్‌” ను మరాఠీ, గుజరాతీ భాషలలోకి అనువదించడానికి అనుమతులు కోరబడ్డాయి. ఈ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద సాహిత్యానికిచ్చే అవార్డు పీవీ గారికి లభించింది.

ఆ సందర్భంలో సుప్రసిద్ద పాత్రికేయులు కీ. శే. జి. కృష్ణ గారు విశ్వనాథ వద్దకు వెళ్ళి, “సహస్ర ఫణ్” గురించి ప్రశ్నలు అడిగారు. అందుకు బదులుగా ఆయన “నాకు ఆ హిందీ నడవదు. మీరు చదివారు కదా! ఎట్లా వుంది? అని కృష్ణ గారిని అడిగారట. అందుకు ఆయన మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెబుతాను. పీవీ నరసింహారావు అనే రచయిత “సహస్ర ఫణ్‌” అనే నవల రాస్తే, దానిని విశ్వనాథ సత్యనారాయణ తెలుగులోకి అనువదించారని చెప్పుకుంటున్నారు” అని జవాబిచ్చారు. దానికి విశ్వనాథ పొంగిపోయారని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఉడయవర్లు గారు 25-12-2004 నాటి ఆంధ్రప్రభ దినపత్రికలో రాశారు.

“విశ్వనాథ మనకూ, ప్రపంచానికీ ఇస్తున్న విభూతిని ప్రతి ఒక్కరూ సవిమర్శగా అర్ధం చేసుకోవాలి. ఆయన సాహిత్య సేవ ఎడతెగకుండా పారే జీవనది వంటిది. ఓ మహాస్రవంతి. దివ్యంగా, ధారావాహికంగా ప్రవహించే పరమపావనియైన జాహ్నవి వంటిది. ఎక్కడ దోసిలి పట్టి త్రాగినా, త్రాగవచ్చు” అని విశ్వనాథ సాహిత్యాన్ని విశ్లేషించారు పీవీ గారు (ఆంధ్రప్రభ 30-08-1971).

తెలుగులో తన రచనా వ్యాసాంగానికి ప్రేరణ విశ్వనాథ సత్యనారాయణ రచనలేనని పీవీ తెలిపారు. విశ్వనాథ వారంటే పీవీకి అమితమైన గౌరవం. ప్రత్యేకంగా విశ్వనాథ వారిని చూడటానికి ముఖ్యమంత్రిగా పీవీ గారు విజయవాడకు వెళ్ళిన రోజులున్నాయి.

పీవీ గారి అనువాద ప్రతిభకు మరో తార్మాణం “అబలా జీవితం”. మరాఠీ సాహిత్యంలో ఆణిముత్యంగా భావించే “పన్‌ లక్షత్‌ కోన్‌ ఘొతో” (ఎవరికి పట్టింది!) నవలకు ఇది అనువాదం. బహుభాషా కోవిదులైన పీవీ కి మరాఠీ భాషలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. అది ఈ అనువాదంతో జగద్విదితమైంది. ఈ నవల మూల రచయిత (శీ హరినారాయణ్‌ ఆప్టే మరాఠీ సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సుప్రసిద్ధ రచయిత. గోపాలకృష్ణ గోఖలే వంటి జాతీయ నాయకులకు ఆత్మీయుడు. ఆయన రచించిన 18 నవలల్లో ఇది ప్రసిద్ధమైంది.

ఇది తెలుగు నవలే అన్నంత సాఫీగా సాగింది ఆ అనువాదం. అనూహ్యమైన వర్ణనలతో సాగే ఈ రచనను సరళమైన తెలుగులోకి అనువదించారు పీవీ. దీని ద్వారా తెలుగు సాహిత్యానికి ఒక అరుదైన జోడింవు లభించింది. ప్రదానంగా రెండు కుటుంబాలను కేంద్రీకరించుకుని సాగిన ఈ నవల 19వ శతాబ్దంలో స్త్రీల స్థితిగతులకు, పరిస్థితులకు అద్దం పదుతుంది.

ప్రసిద్ధ రచయిత్రి శీమతి జయప్రభ తన తెలుగు కవితా సంకలనం పుస్తకాన్ని ఇవ్వడానికి ఆమె ఒకసారి పీవీ గారినీ కలిశారు.ఆ పుస్తకాన్ని అందుకున్న పీవీ అందులోని కొన్ని కవితలు చదివి, మీ కవితలు చాలా బాగున్నాయి. ఎవరైనా ఇంగ్లీష్‌ బాగా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడీ * నవంబరు-2020

23