పుట:ధనాభిరామము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

75


    డెనసినవేడుక నిరువురు
    వినుఁడు సమం బరసి చూడ విశ్వములోనన్. 105

గీ. రూపు లేకున్న జగములో రూఢి లేదు
   ధనము లేకున్న మఱియు సంతకును గొఱఁత
   వలయురూపంబు ధనము నవశ్య మఖిల
   మానవులకును సురలకు మాన కిపుడు. 106

వ. అని మీలోపల మీకు విరోధంబు వలవదు. యథా
    పూర్వంబునఁ గూడియుండుం డని యిరువుర నొక్కటి చేసి
    వారలకు వలయుకోరికల నిచ్చి సర్వేశ్వరుఁ డంతర్ధానంబు
    నొందె. తనమూర్తి త్రిలింగాకారంబున భీమేశ్వరుఁడుగా
    వసియించి పూజలు గొనుచుండె, సకలదేవతలు యథా
    స్థానంబులకుం జనిరి. అందలి నారులు రూపధనాధిక్యంబుల
    మించి తొల్లిటియట్ల సుఖంబున నుండిరి. 107

క. వినయమున నీచరిత్రము
   వినినం జదివినను మిగుల వేడుకతో వ్రా
   సినవారి కెల్లఁ గలుగును
   ఘసపుత్రవిశేషవిభవకామితఫలముల్.108

శా. కుంభీంద్రాసురవిక్రమక్రమపటుక్రూరరవాటోపసం
    రంభప్రాభవభంజనోగ్రతరవీరస్ఫారకేళీభుజా
    స్తంభస్తుత్య! సమస్తలోక మహితోద్యచ్ఛైలకన్యాధిపా!
    యంభోజప్రభవామరేంద్రనుతదాక్షారామభీమేశ్వరా! 109