పుట:ధనాభిరామము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

పై పద్యములవలన నీతఁడు తిక్కనసోమయాజి జన్మించిన వంశమున ననఁగా నమాత్యవంశమున జన్మించెననియు, నూతన కవియని బిరుదనామమును ధరించినవాఁడనియు, నాపస్తంబసూత్ర కాశ్యపగోత్రుఁడనియు, శివపూజాధురంధరుఁడనియుఁ దెలియుచున్నది. వంశవివరము లివి:-

అనంతసేనుఁడు

మల్లయ

తిప్పయ-పార్వతమ్మ

సూరయ-

ఈతఁడు వీరభద్రస్వామి కృపాకటాక్షముచేఁ గావ్యకవితావిశేషములను గ్రహించి ప్రసిద్ధుఁడైనవాడు.

కాలము

ఈ గ్రంథములో రచనాకాలము చెప్పఁబడకున్నను కవి స్తుతినిఁబట్టి యీకావ్యరచనాకాలము నిర్ణయింపవీలగుచున్నది. కవిస్తుతిలో నిట్లు కలదు:--

చ. అలఘుని శబ్దశాసనపదాంకితుఁ దిక్కనసోమయాజి ని
    శ్చలమతి శంభుదాసు బుధసన్నుతు నాచనసోమనార్యు, చె
    న్నలరిన చిమ్మపూఁడి యమరాధిపు భాస్కరు రంగనాథునిం
    దలతు నపూర్వచిత్రకవితామహనీయసమగ్రచిత్తులన్.