పుట:ధనాభిరామము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

ధనాభిరామము

పీఠిక

శా. శ్రీధాత్రీధరకన్య కారమణు దాక్షిణ్యాంబుధిన్ సర్వలో
     కాధారున్ ఫణిరాజకంకణుని చంద్రాకల్పు సర్వజ్ఞు స
     ద్బోథానందకరైక భక్తహృదయాంభోజాతవాసున్ వచో
     మాధుర్యంబున దక్షవాటిపురి భీమస్వామి చింతించెదన్. 1

చ. ఒసపరి యింద్రనీలములయెప్పు నటించెడి మేనికాంతితో
    ముసలగ దాసి శూలకరముద్గరకుంతశ రాసనోగ్రప
    ట్టెసపటుఖేట కావళివడిన్ దనహస్తమునన్ వెలుంగఁగా
    పొసగిన మేటివేలుపని పూని భజించెద వీరభద్రునిన్. 2

ఉ. కోరికమీర పాల్కడలికూఁతునకున్ వలకన్ను గీటి యిం
     పారగ ధారుణీసతికి నావలి దాపలికన్ను గీటి తా
     వారికి వారిలోపలను వాదముఁ బుట్టఁగజేసి నవ్వుతో
     నూరక యుండువిష్ణు జలజోదరు గొల్చెద భ క్తితోడుతన్ . 3

చ. పలుకులబోఁటితోఁ గలసి భావమునం దరలేక నిచ్చలున్
    వలపులరాజు కయ్యమున వాడిమిఁ జూపి సుఖాబ్ధి దేలుచున్
    కలయ చరాచరంబుల సుఖస్థితిమై సృజియించు ప్రోడయం
    న్నలువ దలంచి మ్రొక్కెద మనంబున కోరికె లంకురింపగన్ . 4