పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపోద్ఘాతము

వ్యాస ప్రోక్తమగు సంస్కృత మహాభారతము మాతృకగా గవిత్రయకృతమైన ఆంధ్ర మహాభారతమవతరించినట్లే, కాలాంతరమున, ఆ కవిత్రయ భారతము మాతృకగా నీ ద్విపద భాగవతమవతరించినది. ఇది యపరకవిత్రయకర్తృకము.

తిమ్మయ, సోమన, బాలసరస్వతి అనెడి యీ ద్విపద భారత కర్తలు మువ్వురిలో తిమ్మయ నన్నయభట్టు వంటి వాడు. ఈ మహానుభావుడు భారతము ద్విపదీకరించవలెనని సంకల్పించి ఆదిపర్వము మొదలు ద్రోణపర్వాంతమువఱకు గల యేడు పర్వములలో సభాపర్వముదక్క దక్కిన యాఱిటిని నిర్వహించి కొంతవఱకు సిద్ధసంకల్పుడయ్యెను. కర్ణపర్వమాదిగా మిగిలినపర్వములను రచించి గ్రంథమును బూర్తిచేసినవాడు సోమన. మధ్య మిగిలిపోయిన సభాపర్వమును వ్రాసినవాడు బాలసరస్వతీశ్వరుడు. ఈ సభాపర్వకర్త, ఈ మహాకావ్య నిర్మాణములో నీకొంచెపుపాలుడక్కగొనుటకు తిమ్మనార్యుననుగ్రహమే కారణమని తోచుచున్నది. తనకు శిష్యప్రాయుడో మిత్రుడో అయిన బాలసరస్వతి ప్రార్థన నంగీకరించి తిమ్మనార్యుడీచిన్ని పర్వమును అతని పరము చేసియుండును. లేకున్న దీని తరువాత మఱియైదుపర్వములు కొనసాగించిన ఆదిపర్వకర్త, రెండవపర్వమును స్పృశింపక వదలుటకు హేతువు కానరాదు. ఆదిపర్వరచనతోనే యాతడస్తమించియున్నచో బరిశిష్టభాగమును బూరించిభారము బాలసరస్వతి తానైవహించెననవచ్చును గాని, అదియట్టిది గాక యాపై నైదుపర్వములు తిమ్మయకృతములుగా గానవచ్చుటచే, ఈ సభాపర్వము పరశిష్టభాగమనుటకు వలనుపడదు. పూర్వకాలము రామాయణ రచనకుపక్రమించిన భాస్కరుడు తన పుత్త్రుడనెడను శిష్యునెడను ఇట్టి యనుగ్రహమునే చూసి కొన్ని కాండములు వారిపరము చేయుటయు, ఈ కాలమున శ్రీతిరుపతి వేంకటేశ్వరకవులు దేవీభాగవతమున రెండుస్కంధములుతమ కవిమిత్రులచే వ్రాయించుటయు ఈ సంప్రదాయమునకే దృష్టాంతములుగా బేర్కొనవచ్చును. భాగవతమున వెలిగందలనారయాదులపేర గొన్నస్కంధములు కానవచ్చుటయు నీయాచారమునుబట్టియనియే నాయూహ.