పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

143


తగఁ బుండరీక [1]భూదారభావములు
జగతి ఖడ్లిత్వంబు చామరత్వంబు
వనమృగంబులు దాల్చి వర్తించుటెట్టు'!
లని మృగంబులమీఁద నలిగెనో! యనఁగ
వేటలాడఁగఁబూని వెడలి, యారాజు
గాటమై సేనలు కదిసి సేవింప
వందిబృందంబు కైవారంబుసేయ,
నందంద మ్రోయంగ నఖిలవాద్యములు
ద్రిజగంబు వ్రేల్మిడి దిరిగిరానోపు
నిజజవాశ్వరథంబు నెమ్మితో నెక్కి
సకలసాధనములుఁ జనుదేర వెంట
నకలంకగతి నేఁగె నడవిలోపలకు.
శరభ వాహ వరాహ శార్దూల గవయ
రురు శల్య భల్లూక రోహిత వృషభ
కరివైరి వారణ ఖడ్గ గంధర్వ
హరిణాది మృగకోటి నవలీలఁగదిసి
చించియు, నొంచియుఁ, జెదలనేసియును,
ద్రుంచియు, దంచియుఁ, దూలనేసియును,
గెడపియు, నెడిపియు, గీటడంచియును,
బొడిచియు, నడఁచియుఁ, బోకక్రుమ్మియును,
నులిచియుఁ, బఱచియు, నొగులనేసియును,
బలువిడి నీరీతి బహుళమార్గముల
విలువిద్య యెంతయు వేడిమిచూపి,
కలమృగంబులనెల్ల గలగుండుపెట్టి,
పట్టినమృగకోటిఁ బట్టణంబునకుఁ
బెట్టిపుత్తెంచుచుఁ, బృథివీశుఁ డంతఁ,

  1. సుధార (మూ )