పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము.


రసికుండు నయశాలి రాజపూజితుఁడు
వసుధలో భారతవంశవర్ధనుఁడు ;
సకలవిద్యలయందు సార్వభౌముండు ;
ప్రకటింప వీఁ డెట్లు పరుల సేవించు?"
నన విని నకులుండు నవనీశుతోడఁ
దనకుఁ దోఁచినరీతిఁ దగ నిట్టు లనియె:
"ధరణీశ, నాకు నై తలఁకంగ నేల
వెర వొప్ప నొకయేఁడు విహరించు టెంత
సాహిణి నై మత్స్య జనపాలునొద్ద
నూహించి దిద్దుదు నుత్తమాశ్వముల,
కుఱచకళ్లెంబులఁ గొదమగుఱ్ఱముల
నొఱపుగా మరిగించి, యోర్పు వాటిల్ల
బిరుదువారువముల బీరువోఁ దఱిమి
వరుస నోజకుఁ దెచ్చి పఱపింప నేర్తు.
ఒనర గోడిగజాతి నుత్తమం బెఱిఁగి
యను వైనమాపుతో హత్తింప నేర్తు.
తేజీలత్రాణల తెఱఁ గెల్ల నెఱిఁగి
నైజంబు చెడకుండ నడపింప నేర్తు.
మఱియు లాయములోని మాపటీలకును
మఱవక మేటి నై మనుజేంద్రుఁ గొలుతు.