పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8


"శాసన విరుద్ధము" "చేయుటకు శాసన బద్దత "

43. శాసన విరుధ్ధము" అను పదము ఒక ఆపరాధమైనట్టి, లేక శాసనముచే నిషేధింపబడినట్టి, లేక ఒక సివిలు చర్యకు ఆధారము నిచ్చునట్టి ప్రతి పనికిని వర్తించును, మరియు ఏ పనిని ఒక వ్యక్తి చేయకుండుట శాసనవిరుద్ధ మగునో దానిని చేయుటకు అతడు "శాసన రీత్యా బద్దుడై" యున్నట్లు చెప్పబడును.

"హాని”

44. "హాని” అను పదము శాసన విరుద్ధముగ ఎవరేని వ్యక్తికి శారీరకముగా, మానసికముగా, ఖ్యాతి విషయముగా లేక ఆస్తి విషయముగా కలిగింపబడిన ఎటువంటి కీడునైనను తెలుపును.

“ప్రాణము"

45. "ప్రాణము" అను పదము సందర్భమును బట్టి వైరుధ్యము కాన్పించిననే తప్ప, ఒక మనిషి, యొక్క ప్రాణమును తెలుపును.

"మరణము "

46. " మరణము” అను పదము, సందర్భమును బట్టి వైరుధ్యము కాన్పించిననే తప్ప, ఒక మనిషి యొక్క మరణమును తెలుపును.


"జంతువు"

47. “జంతువు” అను పదము మనిషి, కానట్టి ఏ సజీవ ప్రాణినైనను తెలుపును.

"జలయానము."

48. "జలయానము" అను పదము జలమార్గమున మనుష్యులను లేక ఆస్తిని చేరవేయుటకు చేయబడిన దేనినైనను తెలుపును.


"సంవత్సరము " " మాసము"

49. "సంవత్సరము ” అను పదమును లేక “ మాసము” అను పదమును ఎచట ఉపయోగించినను, ఆ సంవత్సరమును లేక మాసమును, బ్రిటిష్ క్యాలెండరు ప్రకారము గణింపవలెనని అర్థము చేసికొనవలెను.

“ పరిచ్ఛేదము"

50. "పరిచ్ఛేదము" అను పదము ఈ స్మృతి లోని అధ్యాయములో ముందు అంకెగల వేరు వేరు భాగము లందు ఒక భాగమును తెలుపును.

“ ప్రమాణము "

51. " ప్రమాణము” అను పదపరిధియందు, ప్రమాణమునకు బదులుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన సత్యనిష్టా, ప్రతిజ్ఞ, మరియు, పబ్లికు సేవకుని సమక్షమున చేయుటకుగాని, న్యాయస్థానమునందైనను, కాకపోయినను, రుజువు కొరకు ఉపయోగించుటకు గాని, శాసనము ద్వారా కోరబడిన లేక అనుమతింపబడిన ఏదేని ప్రఖ్యానము చేరియుండును.

"సద్భావము"

52. తగు జాగరూకతయు, సావధానతయు లేకుండ చేయబడినట్టిది లేక విశ్వసింపబడినట్టిది ఏదియు "సద్భావముతో " చేయబడినట్లు లేక విశ్వసింపబడినట్లు చెప్పబడదు.

"ఆశ్రయము"

52- ఏ. ఆశ్రయమొసగబడిన వ్యక్తికి అతని భార్య లేక ఆమె భర్త ఆ ఆశ్రయమును ఇచ్చిన సందర్భములయందు 157వ పరిచ్ఛేదములో మరియు 130 వ పరిచ్ఛేదములో తప్ప, "ఆశ్రయము" అను పద పరిధియందు ఒక వ్యక్తి, అతడు పట్టు బడకుండ తప్పించు కొనుటకు గాను నీడ, తిండి, నీరు, డబ్బు, గుడ్డలు, ఆయుధములు, మందు గుండు సామాగ్రి లేక వాహనములు సమకూర్చుట గాని, ఈ పరిచ్ఛేదములో పేర్కొనినటువంటివే అయినను కాకున్నను ఒక వ్యక్తికి ఏదో విధముగా సహాయ పడుటగాని చేరి యుండును.

అధ్యాయము-3

శిక్షలను గురించి

"శిక్షలు"

53. ఈ స్మృతి నిబంధనల క్రింద అపరాధులకు విధింపబడెడు శిక్షలు,

మొదటిది—— మరణ దండన; రెండవది—— యావజ్జీవ కారావాసము ; మూడవది——XXX నాల్గవది——కారావాసము:—— ఇది రెండు రకములు, అవేవనగా :——

(1) కఠిన కారావాసము, అనగా కఠోర శ్రమతో కూడినది ; (2) సాధారణ కారావాసము;

అయిదవది——ఆస్తి సమపహరణము; ఆరవది—— జుర్మానా,