పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14. వెంకటనరసింహాచార్యులు (చతుర్థ) :- పై వెంకటరామానుజాచార్యులవారి సోదరుడు. సుమారు 8 సం. క్రితము సూర్యాపేటలో పరమపదించినారు. బహుగ్రంథకర్త. చాలాభాగము ముద్రణమైనవి. ముద్రితరచనలు 30 అముద్రితరచనలు 10 గలవు. ముద్రితరచనలలో మాలతీవసంతము, నీలాసుందరీపరిణయము అను ప్రబంధములును, సుచిత్రాభ్యుదయము, సుమాలినీపరిణయము అను నాటకములును ప్రసిద్ధి గాంచినవి.

15. లక్ష్మణాచార్యులు:- సుప్రసిద్ధ హరికథాకథకులైన వీరును వెంకటరామానుజాచార్యుల వారి సోదరులే. చక్కని కవిత చెప్పగలవారు. వీరు భీమపుర లక్ష్మీనారసింహప్రభుశతకము (1959) శబరిసపర్య (1968) హనుమన్నుతి (1968) మొదలైన రచనలు చేసినారు. విశాఖ మండలమందలి భీమునిపట్నములో నున్నారు.

16. పురుషోత్తమాచార్యులు:- 14 నెం. వెంకట నరసింహాచార్యులవారి పుత్రులు - ప్రస్తుతము వీరు సూర్యాపేటయందలి జిల్లాపరిషదున్నతపాఠశాలలో నధ్యాపకులుగా నున్నారు. పిత్ర్యమైన గ్రంథముల ప్రచురించి ప్రచార మొనర్చుటయేగాక - రసవత్కవితతో 'యాదగిరి లక్ష్మీనారసింహప్రభో' యను మకుటముగల శతకమును రచించినారు. ప్రస్తుత మిది ముద్రణ మగుచున్నది.

సింగరాచార్యులకు పూర్వోత్తరముల గల కవుల గూర్చి తెలిసినంతవరకు - వారివారి రచనలతో పరిచయ మొనరించినాను. అనుముల, యాదవాకిళ్ల ప్రాంతములయం దికకొంద రున్నారేమో! గాని వారిని గూర్చిన వివరములు తెలియరాలేదు.

ఇక సింగరాచార్యులవారి చరిత్రలో ప్రవేశింతము.

4. సింగరాచార్యులు - వంశవృక్షము :

దశరధరాజనందనచరిత్రయందును శుద్ధాంధ్రనిరోష్ట్య సీతాకల్యాణమునందును వంశవృక్షము సమానముగా గలదు. అంతేగాక కొన్నిపద్యములు మినహాయించిన రెంటిలోను కృత్యాది సమానముగానే గలదు. ద. రా. నం. చ. ప్రకారముగా సింగరాచార్యుల వంశవృక్ష మిది.