పుట:దశకుమారచరిత్రము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

దశకుమారచరిత్రము

క. పలువురు కొడుకులు విప్రుఁడుఁ
     బలుపాటులు వడుట తేటపడ విని కరుణం
     దలకొని తనచిత్తమునకు
     నెలమిగ నాచేతిరత్న మిచ్చితిఁ బ్రీతిన్.11
ఉ. ఇచ్చిన నాకు దీవన లనేకవిధంబుల నిచ్చి విప్రుఁడుం
     జెచ్చెర నేఁగె నేఁగి యిరుచేతులు త్రాడులఁ గట్టి తేరఁగా
     వచ్చి శరీరవేదన నవారితబాష్పజలంబు లొల్కఁగా
     మ్రుచ్చును నచ్చు వీఁడె యని మోఁదుల కోపక నన్నుఁ జూపినన్.12
వ. ఆవిప్రుని దెచ్చి వారలు నన్నుం బట్టికొని యి ట్లనిరి.13
క. మ్రుచ్చిలి రాజుల ధనములు
     దెచ్చి పరమసాధువోలె దేవరగుడిలోఁ
     జొచ్చినఁ బోవునె పెఱధన
     మెచ్చో డాఁచితి సహాయు లెవ్వరు నీకున్.14
చ. అనిన భయంబునం బొరయ కమ్మణి వాహినితీరభూమి నేఁ
     గనుటయు విప్రుఁ జేర్చిన ప్రకారముఁ జెప్పితి నెన్ని చెప్పినం
     గనుకని యెగ్గులాడుచు నకారణబాధ లొనర్చి నన్ను మ్రు
     చ్చని వెసఁ గట్టి బంధనగృహంబునకుం గొనిపోయి యయ్యెడన్.15
వ. అటమున్న సంకలియ నున్నవారిం గొందఱ నాకుఁ జూపి
     నీతోడియయ్యలు వీరె వీరలు నీవును మంచిమగల రై
     యుండుం డని శృంఖలానియమితచరణుం జేసి పోయిన
     యనంతరంబ.16