పుట:దశకుమారచరిత్రము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

దశకుమారచరిత్రము

వ. అంతకు మున్న మిళితనీహారంబైన మారుతంబుసోకునం
     దెప్పిఱియును బహువ్రణపరివృతశోణితుం డై లావరుటం
     జేసి లేవఁజాలకయున్న రాజహంసమహీవల్లభుం డయ్యవ
     సరంబున.44
క. తనసతి తనపై నెయ్యము
     దనరఁగఁ జావునకుఁ దెగుట తనచెవులారన్
     విని తాన యెట్టకేనియు
     వనితా! యీసాహసంబు వల దని పలికెన్.45
చ. పలికిన నుల్కిపాటు మదిఁ బట్టుకొనంగ నెలుంగుదిక్కు చూ
     డ్కులు పచరించి యాత్మపతిఘోషముచందముకారణంబుగాఁ
     దలఁకక డాయఁబోయి విదితంబుగఁ గాంచె రథంబుమీఁద ని
     ర్మలమణిమండనద్యుతినిరాకృతహంసుని రాజహంసునిన్.46
క. కని సంభ్రమించి నిజపరి
     జనులకు నెఱిఁగించుటయును సచివులుఁ బ్రజయున్
     జనుదెంచి చూచి యందఱు
     ననురాగసాబ్ధి నోలలాడిరి వేడ్కన్.47
వ. అనంతరంబ.48
చ. జనపతి నెత్తి తెచ్చి మృదుశయ్యపయిన్ ముద మొంద నుంచి నే
     ర్పునఁ దనుసక్తశల్యములు వుచ్చి మఖస్థితుఁ జేసి యాత్మవ
     ర్తనములు చెప్పి మంత్రు లనురాగముతోఁ బతిఁ జూచి దేవ! యీ
     వనమున కెట్లు దెచ్చె రథవాజులు సారథి లేక చీఁకటిన్.49