పుట:దశకుమారచరిత్రము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

దశకుమారచరిత్రము

     త్రుండును గామపాలుండును, బదోద్భవుం డను సచివు
     నకు రత్నోద్భవుండును సుశ్రుతుండును సుమంత్రుం
     డును నను తనయులు పుట్టి రి ట్లుదయించినపుత్రవర్గంబు
     లోన సత్యశర్మ ధర్మకర్మపరాయణుం డై తీర్థయాత్ర పోయెఁ
     గామపాలుండు దుర్వినీతుం డై జనకాగ్రజులశాసనంబునం
     దనాదరంబు చేసి యెక్కడికేనియుం జనియె రత్నోద్భ
     వుండు వణిగ్వ్యాపారపారంగతుం డై కలం బెక్కి [1]బేహా
     రంబునం బోయెఁ దక్కినసుమతియు సుమిత్రుండును సుశ్రు
     తుండును సుమంత్రుండును నను నలువురుం దమతండ్రుల
     పిమ్మట నారాజునకుం బ్రధాను లై కార్యంబు లనుష్ఠింప
     వసుమతికి సవతియనం దగు వసుమతీదేవి యగ్రమహి
     షిగా నతండు రాజ్యసుఖంబు లనుభవించుచున్నయెడ
     మాళవదేశాధీశుండైన మానసారుండు రాజ్యగర్వంబున
     గన్నుఁగానక కయ్యంబునకుఁ గాలు ద్రవ్వి యెగ్గు లొనర్చిన
     వానిమీఁదఁ బోవం దలంచి ప్రయాణభేరి సఱవం బంచిన.4
మ. కులశైలంబులు దిర్దిరం దిరుగ దిక్కుంభీంద్రవర్గంబు సం
     చలతం జెంద వియత్తలంబు పగులన్ సర్వంసహాచక్రమా
     కులతం బొందఁగ సప్తసాగరములున్ ఘూర్ణిల్ల లోకంబుల
     ల్లలనాడం జెలఁగెన్ బ్రయాణపటహం బత్యద్భుతాపాదియై.5
వ. తదనంతరంబ.6
క. భేరీభైరవభాంకృతి
     ధూరీకృతశత్రుఁ డగుచుఁ దుహినాంశుకులా

  1. వ్యవహార