పుట:దశకుమారచరిత్రము.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

దశకుమారచరిత్రము

వ. అట్టిసమయంబునం జంద్రపాలితు పరికరం బను కపటజనంబు
     మదంబు లొనర్చి పోటార్చి వేఁటవేడుకలు పుట్టించి
     వారలు మృగంబుల పాలు చేసియు మ్రుచ్చిలి యొరులపైఁ
     జొప్పులు పెట్టియుఁ బెనఁకువలు చేసి చచ్చునంతలు పుట్టిం
     చియు విషంబు లిడియుం జిచ్చులు దగిల్చియు మన్నీల వేఱు
     సేసి యగపడ్డచోట్లఁ దెగఁజూచియు యోధవీరుల సమ
     యించుచుండ.115
క. అధికారిచయముఁ దత్త
     వ్విధముల నవపాడి సేసి వివిధధనంబుల్
     పృథగతి నొక్కొక వెరవున
     నధిపతికిం జెప్ప కంత కంతకుఁ జెఱచెన్.116
క. తొల్లి గలుగు భండారం
     బెల్లను నానావిధముల నెసపోసి పతిం
     జెల్లఁగఁ బనిచిరి గాయక
     పల్లవలౌల్యాభిరతి నపాత్రంబులకున్.117
వ. ఇవ్విధంబున ననంతవర్మ రాజ్యం బస్తవ్యస్తం బగుటయు వసంత
     భానుం డంతకుమున్నం దా నతనికి నవిరోధి యై వర్తిల్లు
     చుండుం గావున గూఢవృత్తిం దద్విరోధి యగు భానువర్మ
     పాలికిం జతురదూతం బుచ్చి యనుకూలభావంబున నిలిచి
     పగ సాధించి యిచ్చువాఁడుగాఁ బూనిన నతండును.118
మ. చటులస్యందనఘట్టనం దెరలి యశ్వవ్రాతచంచత్ఖురో
     ద్భటపాదాతపదాహతి న్నెగసి యుద్యద్వారణశ్రేణికా
     కటనిష్యందిమదాంబువృష్టి నడవంగా భూరజఃపుంజ ము
     త్కటదర్పోద్దతవృత్తి నొత్తి నడచెన్ దండెత్తి యుద్దండుఁడై.119