పుట:దశకుమారచరిత్రము.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

దశకుమారచరిత్రము

వ. ఇట్లు చుట్టఱికంబు చేసి భీమధన్వు సంకలియ పుచ్చి యందఱుం
     గలం బెక్కి యనుకూలమరుత్ప్రసారంబున.184
క. పారావారముతీరము
     చేరిన తపనంతరంబ సెట్టులచేతం
     గారవమునఁ బూజలు గొని
     బోరన నాదామలిప్తపురవరమునకున్.185
చ. భీమధన్వుం గందుకావలిం దోడ్కొని వచ్చి వచ్చి నడుమ.186
మ. కొడుకుం గూఁతురుఁ బట్టువాసినఁ బరిక్షుభ్యన్మనోవృత్తియై
     యడవిం గూడు దొరంగిచాఁదివిరి పౌరానీకమున్ బంధులున్
     గడు శోకింపఁగ నున్నవాఁడు పతి నిక్కం బంచుఁ బెక్కండ్రు రే
     ర్పడఁ జెప్పంగ నెఱింగి కందువకుఁ జేరంబోయితిం బ్రీతితోన్.187
వ. పోయి.188
శా. చింతాభారపరీతచిత్తుఁ డగుచున్ జీవన్మృతుం డై మహీ
     కాంతుం డావులుఁ దానునున్నయెడఁ దత్కాంతారమధ్యంబునన్
     గాంతారత్నము నక్కుమారుఁ గడువేడ్కం జూపి యొప్పించి వృ
     త్తాంతం బంతయుఁ జెప్పితిన్ జనము లత్యాశ్చర్యమున్ బొందఁగన్.189
చ. విని మనుజేశ్వరుండు గడువేడుకతోఁ గొనియాడి నన్ను దో
     కొని పురి కేఁగి యాత్మసుత గోరికకుం దగ నిచ్చి రాజ్యముం
     జనవును నాఁడునాఁటికి నిజంబుగ నాపయిఁ బెట్టి రాజవ
     ర్తనమహనీయుఁ జేసె నుచితజ్ఞతఁ బ్రాజ్ఞులు పిచ్చలింపఁగన్.190