పుట:దశకుమారచరిత్రము.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

దశమాశ్వాసము

క. సురకరికరహతిఁ గల్పక
     తరుమంజరి దూలిపడు విధంబునఁ బడఁగాఁ
     దరుణీరత్నముఁ బట్టితి
     ధరపైఁ బడకుండఁ బాణితలయుగళమునన్.179
వ. ఇట్లు పట్టి చూచి కందుకావతి యగుడు నచ్చెరువంది దూ
     రాపాతమూర్ఛితయైన యక్కన్నియ సేదదేర్చిన నదియు
     ను న న్నెఱింగి యశ్రువ్యాకులితలోచన యై యున్న నెట్టకే
     నియు నూరార్చి నీ వీరక్కసున కగపడ్డ తెఱం గెఱింగింపు
     మనిన ని ట్లనియె.180
ఆ. బేలు పెట్టి పట్టి భీమధన్వుఁడు నిన్ను
     వనధిఁ ద్రోచె ననఁగ విని వియోగ
     వహ్ని గాక శోకవహ్నియు నడరినఁ
     జెలులఁ బాసి సౌధతలమునందు.181
శా. ఏకాంతంబున నున్న నాకడకు బి ట్టేతెంచి కామాంధుఁడై
     యాకాంక్షించినఁ జూచి యే నులికి యుద్యద్భీతిఁ గంపింపగా
     నాకాశంబును దిక్కులుం దనమయం బైనట్లుగా బేర్చి యు
     గ్రాకారంబున నన్నుఁ దెచ్చె దనుజుం డంభోదమార్గంబునన్.182
మ. అని శోకించిన నూఱడించి నిజవృత్తాంతంబు నాభీమధ
     న్వునివృత్తంబును నేర్పడం దెలిపి యేనుం గాంతయున్ రాజనం
     దనుఁ జేరం జని సాధువాక్యముల నత్యంతాప్తి భావించి యా
     తనికిన్ సెట్లకునున్ వచోరచనసంధానంబు గావించితిన్.183