పుట:దశకుమారచరిత్రము.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

275

చ. విని ముదమంది వాడు పృథివీపతిపాలికిఁ బోయి యింతిచె
     ప్పినక్రియఁ జెప్పి పూన్కి మెయిఁ బెంపరకుండఁగ నాలితోడ ని
     ల్చిన విభుపంపునం జనిన లేఖలవారలతోన మామ యిం
     పొనరఁగ వచ్చి తమ్ముఁ గొని యొప్పిద మొందఁగఁ బోవునంతకున్.131
వ. ఇవ్విధంబున బలభద్రుండు నిజస్థానంబునకు మగుడ భార్యా
     సమేతుం డై చనియె నది కారణంబుగాఁ గామంబు సంకల్పం
     బంటి నని చెప్పి మఱియు ని ట్లంటి.132
ఆ. శూరసేనదేశసుభగభూషణ మన
     నొప్పు మధురలోన నొకగృహస్థు
     నందనుండు మదనసుందరాకారుండు
     గలఁడు పేరు కలహకంటకుండు.133
క. మిండఁ డయి తిరుగు బాహా
     దండబలోద్దాముఁ డగుట దర్పంబున నె
     వ్వండుఁ దన కెదురు గాఁ డను
     చుండుఁ గలహలోలమైన యుల్లముతోడన్.134
వ. వాఁ డొక్కనాఁడు వైదేశికుండగు నొక్కరునిచేఁ జిత్ర
     పటంబు గనుంగొని యందు సుందరిచిత్రం బుపలక్షించి
     మదనమోహనమానసుం డై యతని కి ట్లనియె.135
క. ఎలనాఁగచంద మారయఁ
     గులవధు వగు నిదియుఁ గాక కోర్కులు సఫలం
     బులుగా బరిభోగంబులు
     గలయదియును గాదు వృద్ధకామిని యగుటన్.136