పుట:దశకుమారచరిత్రము.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

187

వ. అది రా జున్నభంగి యేమును నేలినవానికిం బొడసూపి
     కుమారులు కిరాతులచేఁ బడిపోకయు మావచ్చిన తెఱం
     గును నెఱింగించితిమి.23
చ. చరణము లేమి నే జఱభిచందము చేకొని యున్న దాననా
     వరసుత యిప్పు డీవికటవరుని వల్లభి యైన కల్పసుం
     దరికడ నిల్చి హీనచరితంబు మెయిం బనిసేయుచుండు నె
     వ్వరు దెస నాకు నీపరిభవంబునకుం గడ యెద్ది పుత్రకా!24
ఆ. అడవిపాలు వడిన యారాజనందను
     లింతదాఁక నిలిచి రేని యింత
     లౌదు రిట్ల వారి యాకారములు నని
     శోక మడరె నిన్నుఁ జూచుటయును.25
వ. అనిన మా చేరినభంగిం బ్రసంగంబులం జెప్పికొన రాజు
     పరివారంబువలనం బలుమాఱును మున్ను వినుటం జేసి యే
     నును నపహారవర్మయు నీయమ్మ చెప్పిన బాలుర మగుదు
     మని మనంబున నిశ్చయించి యేను నీ పెంచినవాఁడ భవత్పు
     త్రిచేతికుమారుండు బ్రదికె ననవుడు విస్మయహర్షసంభ్రమం
     బులు ముప్పిరిగొనం దప్పక నన్నుం గనుంగొనుచు నున్న
     యవ్వకు నేము రాజహంసనరేంద్రుం జేరి పెంపం బెరిఁగితి
     మని రాజు మముం జేకొనియున్న తెఱం గెఱింగించి నృపతి
     వృత్తాంతంబును వసుమతిప్రముఖులైన యంతఃపురకాంతా
     జనంబునుం బరివారంబునుం బేళ్ళును సాభిజ్ఞానంబు గాఁ
     జెప్పి దేవరజననంబును స్వరూపంబునుం బ్రభావంబును జరి
     త్రంబునుం గీర్తించి యే నతని నన్వేషించుటకుం బరి
     భ్రమించుచున్నవాఁడ నని తెలియం బలికిన.26