పుట:దశకుమారచరిత్రము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

దశకుమారచరిత్రము

     తన వై యేడ్చెదు తల్లీ!
     యనుశయకారణము చెప్పు మంతయు నాకున్.6
వ. అనిన విని య త్తపస్విని యిట్లనియె మిథిలానగరంబున కధీ
     శ్వరుండు ప్రహారవర్మ యనం గలయతండు మగధపతి
     యగు రాజహంసుం డను రాజునకు మిత్రుం డై వర్తిల్లు నతని
     భార్య ప్రియంవద మాగధమహిషి వసుమతీదేవితో
     జెలిమి సేసి యి ట్లన్యోన్యస్నేహసముచితాచరణంబులం
     బరిణతం బగు సమయంబున.7
తే. మగధభూపతిదేవిసీమంతమునకు
     నాలు బిడ్డలు దానుఁ బ్రహారవర్మ
     వేడ్క నేఁగి సౌహార్దంబు వెలయ వారి
     యొద్ద నుత్సవలీలల నున్నయంత.8
ఉ. మాళవదేశవల్లభుఁ డమానుషతేజుఁడు లీలతోడ వ
     య్యాళికి వచ్చునట్లు మగధాధిపుపై వెస నెత్తివచ్చినన్
     మాళవమాగధు ల్గడు సమగ్రతమై రణకేళి సల్పుచో
     మాళవుచేత మాగధుఁడు మర్దితుఁ డయ్యె మహాద్భుతంబుగన్.9
తే. అపుడు మాళవుచేతఁ బ్రహారవర్మ
     పట్టుపడి వానికరుణయ ప్రాపు గాఁగఁ
     దనకు విడుమర గాంచి నందనులు సతియుఁ
     దాను హీనుఁ డై యెంతయు దైన్య మొంది.10
వ. విరళపరిజనపరివృతుం డై నిజదేశంబున కరుగుదెంచునప్పు
     డేనును మత్పుత్రియుం దత్కుమారు లిరువురు గావున వారల
     నెత్తికొని వచ్చుచుండితి మట్టియెడ.11