పుట:దశకుమారచరిత్రము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

దశకుమారచరిత్రము

ఉ. శ్రీవిభుఁడైన యామనుమసిద్ధికిఁ బుణ్యచరిత్రయైన శ్రీ
     దేవికిఁ బుట్టెఁ దిక్కజగతీతలనాథుఁ డశేషలోకసం
     భావితుఁడై ధరాభరము వాపఁగ నావసుదేవదేవకీ
     దేవుల కుద్భవించి వినుతిం జెలువొందిన కృష్ణుఁడో యనన్.14
వ. ఇ ట్లుదయించి రాజ్యాభిషిక్తుం డైన యనంతరంబ.15
సీ. బలిమిచేఁ (బృథ్వీశుతలఁ ద్రుంచె) [1]సేవణ
                    కటకసామంతుల గర్వ మణఁచె
     ద్రవిళమండలికు లందఱఁ దక్క నేలెఁ జో
                    డని నిజరాజ్యపీఠమున నిలిపెఁ
     గర్ణాటవిభునహంకారంబు మాన్పించెఁ
                    బాండ్యునిచేతఁ గప్పంబు గొనియె
     నేఱువమన్నీల [2]నెఱి పుట్టఁగా నేలె
                    వైరివీరుల నామలూర నోర్చె
తే. [3]త్రిభువనీరాయపెండారుఁ డుభయకటక
     వీరుఁ డభినవభోజుఁ డాకారమదనుఁ
     డవనిభారధౌరేయమహత్త్వవిజిత
     దిక్కరీంద్రుండు చోడలతిక్కనృపతి.16
క. మరునకు ననిరుద్ధుఁడు శ్రీ
     వరునకు మకరధ్వజుండు వసుదేవునకున్
     హరి పుట్టినక్రియ నతనికి
     జిరతరకీర్తితుఁడు మనుమసిద్ధి జనించెన్.17
వ. అతనిగుణవిశేషంబు లెట్టి వనిన.18

  1. శ్రీ వీరేశలింగముపంతులుగారిప్రతిలో నీ పదము కనఁబడదు.
  2. నిచట విరుద్ధముగా నున్నది.
  3. ఇట విరుద్ధముగాఁ గన్పట్టుచున్నది.