పుట:దశకుమారచరిత్రము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

దశకుమారచరిత్రము

క. ఇచ్చట [1]నకామకృతమున
     వచ్చిన యపరాధమునకు వావిరి శాపం
     బిచ్చితి దీనికి నేఁ గడు
     నొచ్చితిఁ గరుణింపు లోకనుతసచ్చరితా!100
వ. అని ప్రార్థించిన నతం డి ట్లని యనుగ్రహించె రాజవాహ
     నుం డను రాజు పూర్వజనితంబైన శాపంబువలన రెండు నెల
     లు(ండు)వాఁడు గావున నీవును నింద్రియశక్తి సహితం
     బుగా వెండి సంకలియ వై యతనిచరణంబు లాశ్రయించి
     మాసద్వయానంతరంబున నిజాకారంబు పడయు మనినం
     బ్రసాదం బని యాక్షణంబ శాపంబున కనురూపంబు సేసి
     కొని తత్ప్రదేశంబున నున్నంత.101
సీ. వీరశేఖరుఁడను విద్యాధరుండు క్రీ
                    డార్థంబు చనుదెంచి యచట నన్ను
     గని ముదంబునఁ బుచ్చికొనిపోయెఁ బదపడి
                    యాతండు దర్పసారాభిధాను
     మహితతపోవీర్యమహనీయు మీబావఁ
                    జేరి యాతనితోడఁ జెలిమి సేసె
     నతఁడు నెయ్యంబు తియ్యంబునఁ జెలియలి
                    నిచ్చెద నన దాని కియ్యకొనియె
తే. వాఁడు నిష్ఫలమగు తనవాంఛపేర్మి
     నాసరోజాక్షిఁ గనుఁగొను నాసఁజేసి
     వచ్చి యుజ్జయినీపురిఁ జొచ్చి యన్యు
     లెఱుఁగకుండ నంతఃపుర మెల్ల నరసి.102

  1. నాభ్రమ