పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

37


అవకాశంలేదు. అయితే (యుక్తిగా) రేపటినుంచి చేయగలిగినంత చేయుటకు ప్రయత్నిస్తాను. నమ్మండి" అని చెప్పి వేశాడు. ట్రాన్స్‌వాల్ మీద యుద్ధ భేరీ మ్రోగించినప్పుడు లార్డ్ లెన్స్డ్ డౌన్, లార్డ్ సెల్‌బోర్న్ మొదలగు బ్రిటిష్ అధికారులు, యుద్ధానికి గల అనేక కారణాలలో ట్రాన్స్‌వాల్ నందలి భారతీయుల దుస్థితిని నివారించడం కూడా ఒకటి అని ప్రకటించారు. ఇక ట్రాన్స్‌వాల్‌లో గల భారతీయుల స్థితిగతులను పరిశీలిద్దాం. 1881లో భారతీయులు మొదటిసారి ట్రాన్స్‌వాల్‌లో అడుగుపెట్టారు. కీ. శే. సేఠ్ అబూబకర్ ట్రాన్స్‌వాల్ రాజధాని యగు ప్రిటోరియాలో దుకాణం ప్రారంభించాడు. అక్కడి ఒక ముఖ్యమైన చోట నివేశన స్థలం కొన్నాడు తరువాత అనేక మంది భారతీయ వ్యాపారులు కూడా ఒకరి తరువాత మరొకరు అక్కడికి చేరుకున్నారు. వాళ్ల వ్యాపారం బాగా సాగడం చూచి తెల్లవాళ్ల కడుపు తరుక్కుపోయింది. పత్రికల్లో భారతీయులకు వ్యతిరేకంగా జాబులు, వ్యాసాలు వ్రాయడం ప్రారంభించారు. అక్కడి అసెంబ్లీలో కూడా భారతీయుల్ని ట్రాన్స్‌వాల్ నుంచి వెళ్లగొట్టండి వాళ్లను వ్యాపారం చేసుకోనీయవద్దు" అని ప్రసంగాలు జరిగాయి. అర్జీలు కూడా దాఖలు చేశారు. ట్రాన్స్‌వాల్ వంటి క్రొత్త దేశంలో బ్రిటిష్ వారి ధనతృష్ణకు అంతు లేకుండా పోయింది నీతికి అవినీతికి మధ్య గల తేడా వాళ్లకు తెలియదు అసెంబ్లీకి దాఖలు చేసిన ఆర్జీలలో “వీళ్లు (భారతీయ వ్యాపారులు) మానవ సభ్యత అంటే ఏమిటో ఎరుగరు. చెడునడత వల్ల సంక్రమించే రోగాలతో కుళ్లిపోతున్నారు. ప్రతి ఆడదాన్ని తమ వేట జంతువని భావిస్తున్నారు. ఆడవాళ్లకు ఆత్మ లేదని వాళ్లు భావిస్తున్నారు" అని కూడా వ్రాశారు. యీ నాలుగు వాక్యాలలో నాలుగు అబద్దాలు వున్నాయి. యిటువంటి ఉదాహరణలు ఎన్నో యివ్వవచ్చు. అక్కడి అసెంబ్లీ మెంబర్లు కూడా యిలా వ్రాసిన తెల్ల వారి వంటిరకమే తమకు వ్యతిరేకంగా అసహ్యకరమైన వ్యతిరేక ఉద్యమం సాగుతున్నదని భారతీయ వ్యాపారులు గ్రహించలేదు. వాళ్లు పత్రికలు చదివే వారు కాదు. తెల్లవాళ్ల పత్రికల ప్రభావం, అసెంబ్లీకి దాఖలు చేసిన తెల్లవారి అర్జీల ప్రభావం బాగా పని చేసింది. తత్ఫలితంగా అసెంబ్లీలో