3. అనుకృతి
ఒకసారి ప్రయోగించబడిన భాషాంశాలు మరోసారి ప్రయోగించబడటం అనుకృతి. ఒక వక్త ఒక శ్రోతతో అన్నదాన్ని ఇంకో వక్త ఇంకో శ్రోతకు నివేదించవచ్చు. మొదటిశ్రోత, రెండోవక్త ఒకటికావచ్చు. మొదట వక్తృశ్రోతలే రెండోసారికూడా వక్తృశ్రోతలుకావచ్చు, వ్యత్యయంకూడా కావచ్చు, ఒకవక్త తాను అన్నదాన్నే తనకుతానే వక్తగాను, శ్రోతగాను వ్యవహరించి అనుకరించవచ్చు.
3.1 : దీన్నికూడా నామ్నీకరణంగా భావించవచ్చుగాని, మామూలు నామ్నీకరణాలకన్నా అతివిస్తృతమైన పరిధిగలది కావటంవల్ల దీన్ని వేరుగా భావించాల్సివస్తున్నది. నిజానికి అనుకృతాంశానికి అవధులులేవు. అనుకృతాంశం భాషలో ఏ అంశమైనాకావచ్చు. ఒక వర్ణంకావచ్చు, శబ్దంకావచ్చు, పదంకావచ్చు, వాక్యంకావచ్చు, అనంతమైన వాక్క సమూహంకావచ్చు. అనుకృతాంశానికి భాషావధి కూడాలేదు. ఏ భాషాఅంశాన్నైనా ఇంకోభాషలో అనుకరించవచ్చు. భాషకు దేశకాల నిరవధికత్వాన్ని ఆపాదించేది ఈ ఆనుకరణ, భాషాంశాలనే అనుకరించాలన్న నియమంలేదు. చేతనాచేతన జన్యమైన ఏ ధ్వనైనా అనుకరణార్హమే. కుక్క భౌ,భౌ మని అరుస్తున్నది, గజ్జెలు ఘల్లుమల్లుమంటున్నై- ఇత్యాది వాక్యాలు అనుకరణ వాక్యాలే. అనుకృతాంశం శబ్దమయంకూడా కానక్కరలేదు. చేష్టాదికాలనుకూడా అనుకరించి భాషతో అనుసంబంధించవచ్చు. ఇంత విస్తృతమైన పరిధిఉన్న అనుకరణవిధానం సర్వభాషా సామాన్యం కావటంలో విశేషంలేదు.
3.2 : ఈ అనుకరణను . ప్రత్యక్షపరోక్ష అనుకృతులుగా విభజించటం పరిపాటి. ఉన్నవి ఉన్నట్టుగా అనుకరించి చెపితే - ప్రత్యక్షానుకృతి, ఆనుకృతాంశంలో విషయాన్ని మాత్రమే అనుకరించి చెప్పేది పరోక్షానుకృతి. ఇదికూడా సర్వభాషా సానూన్యలక్షణమే. అనుకృతిని శబ్దానికి మాత్రమే పరిమితంచేస్తే, ప్రత్యక్షాను కృతిని శబ్దప్రధానమని (code centred), పరోక్షానుకృతిని అర్థప్రధానమని (information centred) చెప్పుకోవచ్చు. పైనచెప్పిన దేశ, కాల, శబ్ద, భాషా నిరవధికత ప్రత్యక్షానుకృతికే వర్తిస్తుంది. పరోక్షానుకృతికి కొన్ని పరిమితులున్నై.