పుట:తెలుగు వాక్యం.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

45

అనే పదబంధానికి నిరనుబంధ బోధతో సమానం. రెండు ప్రతిపాదిత విషయాల మధ్య వైరుధ్య మున్నట్టు భావించినప్పుడు కూడా ఈ శబ్దాల ప్రయోగం జరుగుతుంది. ఉదాహరణకు ఈ కింది వాక్యాలు చూడండి.

(128)

a. మనది ప్రజాస్వామ్య దేశం. అయినా పౌరహక్కులు లేవు.
b. ఆయన చాలా గొప్ప పండితుడు. కాని కొద్దిగా కొసవెర్రి ఉంది.

2.46 : చేదర్థక క్రియకులాగే అప్యర్థక క్రియ తరవాత కూడా కొన్ని పదబంధాలు ప్రధాన వాక్యాల స్థానంలో వస్తై.

(129)

a. గుడ్డికన్ను మూసినా ఒకటే, తెరచినా ఒకటే.
b. కవిత్వానికి ఛందస్సు లేకపోయినా ఫరవాలేదు.
c. ఈ రోజుల్లో కష్టపడి చదివినా ప్రయోజనం లేదు.

2.47 : క్త్వార్థకాది అసమాపక క్రియా వాక్యాలు సానుబంధ బోధకాలనీ,. అప్యర్థక వాక్యాలు నిరనుబంధ బోధకాలనీ, పూర్వం సూచించబడింది. ఈ అనుబంధ భేదాల్నిబట్టి క్త్వార్థక, శత్రర్థక, చేదర్థక భేదాలు ఏర్పడ్డై. క్త్వార్థకం వ్యాపార ఆనుపూర్విక సంబంధాన్ని, శత్రర్థకం నమసామయిక సంబంధాన్ని తెలియజేస్తై. ఆ రెంటికీ ఏకకర్తృకాది నియమాలు కొన్ని సమానంగా ఉన్నై. ఆ రెండూ ప్రధాన వ్యాపారానికి రీత్యర్థక విశేషణాలుగా ప్రవర్తించటం కూడా చూశాం. చేదర్థక అప్యర్థక భేదం వ్యాపారాధార నిరాధార భేదాన్ని బట్టి ఏర్పడింది, ఆర్థికంగా అప్యర్థక వాక్యాలను చేదర్థక వాక్యాలకు వ్యతిరేక సమ రూపాలుగా భావించవచ్చు. ఈ రెంటికీ కొన్ని సామ్యాలున్నై. భూతకాలిక సంభావ్యమాన వ్యాపారసూచక అఖ్యాత ప్రయోగం రెంటికీ సమానం. ఈ రెంటికీ ఏక కర్తృక నియమం లేదు.

2.5 : ఇవికాక వ్యాపారాలమధ్య కాలవ్యవధికత, అవ్యవధికత, హేతువు, మొదలైనవి ఉపవాక్యాల ద్వారా వ్యక్తమవుతై. ఉపవాక్యాల్లో అన్నంతక్రియ క్రియమీదగానీ, అక ప్రత్యయాంతావ్యయం మీదగానీ, ధాతుజవిశేషణం మీద గానీ కొన్ని ప్రత్యయాలకు, అవ్యయాలను చేర్చటంవల్ల ఈ అర్థాలు సాధ్యమవుతై .

(130)

a. సుజాత నిద్ర లేవగానే కాఫీ తాగుతుంది.
b. సుజాత నిద్ర లేచిన వెంటనే కాఫీ తాగుతుంది.