పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు ప్రదక్షణ మొనర్చుచు గుంపులేక చక్కగా దర్శనము చేయించగలందులకు నన్ను కోరఁగా నేనందుకు సౌకర్య మొనర్చినాఁడను. ఆమె మఱుశుక్రవారమున గోవిందనామస్మరణఁ జేయుచు ఆవేశముతో నంగప్రదక్షణముఁ జేయుచుండెను. దైవ మాయఁజెప్పుట కలవికాదు. ఆమె ప్రదక్షణములోఁ గాళ్లును చాఁచెను. అంగప్రదక్షణసమాప్తియందు ముడుపుబట్టుకొని యావేశముతో నడిచివచ్చి బంగారు వాకిలిముందు నిలుచుకొనియున్న నన్ను "హుండిఎల్లి" అని కన్నడభాషలో నడుగ నేనుఁ జూపితి. అందులో ముడుపుఁ జెల్లించి యాఱుగురితోఁ గూడిన యాకుటుంబమా అభిషేకదర్శనపు టిక్కెట్లుకొని లోపలికివెళ్లిరి. అనంతర మావేశము నిలిచెను. సంతోషముతో వారింటికిఁ జనిరి. దీనినిఁ బ్రత్యక్షముగాఁ జూచినవా రనేకులు గలరు. ఇట్టి మహానుభావుని దర్శనమునకు విచ్చేయువారి సౌకర్యార్థము నేను దీనిని వ్రాసినాఁడను. శబ్దదోషము లెంచక అర్థగుణములను గ్రహింపఁ బ్రార్థించెదను.

ఇట్లు సుజనవిధేయుఁడు

ఎన్. వి. లక్ష్మీనరసింహారావు.

తిరుమల.

21-4-19